
- హిందీ దివస్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు: స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాల పేరిట కొందరు ఈ దేశాన్ని విచ్ఛినం చేసే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఒక్కసారి గద్దెనెక్కిన తర్వాత తమ పదవులను కాపాడుకోవడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఇది దేశ భవిష్యత్‌కు మంచిది కాదని అన్నారు.
1949లో భారత రాజ్యాంగ సభ హిందీని దేశ అధికార భాషగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో ఇంగ్లిష్ ప్రాధాన్యం పెరిగినా, హిందీ తన స్థానాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్, తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహేశ్ గౌడ్ చీఫ్ గెస్ట్‌గా మాట్లాడారు. తెలంగాణ లౌకికవాదానికి పెట్టింది పేరని.. ఇక్కడ భాష, ప్రాంతం అనే భేదం లేదని, అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారని చెప్పారు. అధికార భాషగా హిందీ ఈ దేశ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు.
మార్వాడీలపై దాడులు సరికాదు: చాడ
భాషలు, మతాలు వేరైనా మనమంతా భారతీయులమని చాడ వెంకటరెడ్డి అన్నారు. పరస్పరం గౌరవించుకుంటూ జీవించాలని, మార్వాడీలపై దాడులు సరికాదని ఆయన పేర్కొన్నారు. అనంతరం హర్కర వేణుగోపాల్ రావు, విశ్వనాథన్, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి మాట్లాడారు. భాషలు, మాండలికాలకు వారధి హిందీ భాషేనని అన్నారు.
అనేక భాషలకు నిలయమైన మన దేశంలో అత్యధిక జనాభా మాట్లాడేది హిందీ భాష కావడంతోనే ఆనాడే దేశ అధికారిక భాషగా గుర్తించబడిందని పేర్కొన్నారు. అనంతరం, హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ అవార్డును కవి, జర్నలిస్టు అర్వింద్ యాదవ్‌కు ప్రదానం చేశారు. సీనియర్ జర్నలిస్టు సదాశివ శర్మ అవార్డును మిడ్‌నైట్ రిపోర్టర్ చైతన్య సింగ్, విద్యారణ్య హరిబెలికే అవార్డును హిందీ కవి మీనాలలిత్ ముతాకు అందజేశారు.
కాంగ్రెస్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ చైర్మన్ రాజేశ్ కుమార్ అగర్వాల్, తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎన్ఎస్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్ర ప్రణాళిక కమిషన్ చైర్మన్ చిన్నా రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహెర్ హాజరయ్యారు. తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంఏ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.