హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సమిట్ తో రాష్ట్రానికి ఊహించని పెట్టుబడులు వచ్చాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ నిలవబోతున్నదని చెప్పారు. మంగళవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ అనేది చారిత్రాత్మకమైన నిర్ణయమని అన్నారు.
తెలంగాణకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి శుభపరిణామమని చెప్పారు. ఆ సమిట్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు పాల్గొనడం తెలంగాణ ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించినట్లయిందని అన్నారు. గ్లోబల్ సమిట్ సూపర్ సక్సెస్ అని, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ఆయన అభినందనలు చెప్పారు.
బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్
కాంగ్రెస్ హైకమాండ్ డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసి.. డిసెంబర్ 23న వెనక్కి తీసుకున్నందుకు ఆ రోజును విద్రోహ దినంగా పాటించాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనను హరీశ్ మర్చిపోయి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అని అన్నారు.
కాగా, 90 శాతం సర్పంచ్‌లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మహేశ్గౌడ్చెప్పారు. తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా రహ్మత్ నగర్ ఎస్టీ రిజర్వుడ్ స్థానంలో విద్యావంతుడు తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు.

