- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
కామారెడ్డి, వెలుగు : వరి పంట వేయకండి.. కొనే పరిస్థితి లేదన్న బీజేపీ.. వరి వేస్తే ఉరి అన్న బీఆర్ఎస్ ఇప్పుడు కూడబలుక్కొని కల్లాల పొంట తిరుగుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మంగళవారం కామారెడ్డిలో డీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొంటుందని, కానీ, తమ ప్రభుత్వం ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నదని వివరించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పని అయిపోయిందని, ఎవరెన్ని చెప్పినా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుంటున్న ప్రజలు పంచాయతీ, మున్సిపల్‌ఎన్నికల్లో తమకే పట్టం కట్టారని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు గెలిచేలా కృషి చేయాలన్నారు. తనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై ఇదివరకే వివరణ ఇచ్చానని, అది ముగిసిన అధ్యాయమని పీసీసీ చీఫ్ తెలిపారు.
మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పత్రికలకు స్వేచ్చ ఉందని కామెంట్ చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి పాల్గొన్నారు.
