స్థానిక ఎన్నికలపై త్వరలో నిర్ణయం:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

స్థానిక ఎన్నికలపై త్వరలో నిర్ణయం:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ఒకట్రెండు రోజుల్లో సీఎంతో చర్చిస్తం: మహేశ్​ గౌడ్​
  • హైకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తాం
  • బీసీ బిల్లులకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడ్తున్నరు
  • రెండేండ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నరు
  • అందుకే జూబ్లీహిల్స్​లో గెలవబోతున్నం
  • వచ్చేసారి వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తం.. అప్పటికి బీఆర్​ఎస్​ ఉండదు
  • నెలాఖరు నాటికి డీసీసీ, పార్టీ ఇతర పదవుల భర్తీ ఉంటుందని వెల్లడి
  • మీడియాతో పీసీసీ చీఫ్​ చిట్​చాట్​


హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలపై  రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ ​మహేశ్ కుమార్ గౌడ్  తెలిపారు. ‘‘లోకల్​బాడీ ఎలక్షన్​ విషయంలో హైకమాండ్ అభిప్రాయాన్ని తీసుకుంటం. హైకోర్టు తీర్పు రాగానే దాని ప్రకారం ముందుకు వెళ్తం” అని చెప్పారు. బుధవారం గాంధీ భవన్​లో మీడియాతో మహేశ్​గౌడ్​ చిట్ చాట్ చేశారు. బీసీ బిల్లులకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడుతున్నారని.. బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు.

‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలనే చిత్తశుద్ధితో ఇటు కాంగ్రెస్, అటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. కానీ కేంద్రం అడ్డుపడుతుండడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి” అని మహేశ్​ గౌడ్​ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండేండ్ల ప్రజా పాలనపై జనం పూర్తి సంతృప్తిగాఉన్నారని, అందుకే జూబ్లీహిల్స్ లో జనం కాంగ్రెస్ ను మంచి మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆయన తెలిపారు.

 ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లతో రెండోసారి అధికారంలోకి వస్తం. మళ్లీ సీఎంగా రేవంత్ రెడ్డియే కొనసాగుతరు” అని చెప్పారు. డిప్యూటీ సీఎం అవుతారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, పీపీసీ చీఫ్​గా తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని తెలిపారు. 

‘వీ6 వెలుగు’ పేరుతో బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం

‘‘కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందనే బీఆర్ఎస్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. రిగ్గింగ్ అనేది దేశంలో ఎక్కడా సాధ్యం కాదు” అని పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ అన్నారు. సోషల్ మీడియాను బీఆర్​ఎస్​ ఫేక్​ న్యూస్​కోసం వాడుతున్నదని, పోలింగ్ సమయంలో ‘వీ6 వెలుగు’ పేరుతో బ్రేకింగ్ అంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ అనేదే ఉండదని ఆయన అన్నారు. 

బాంబు పేలుళ్లకు నిఘా వైఫల్యమే కారణం

ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు పూర్తిగా నిఘా సంస్థల వైఫల్యమేనని పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిహార్ లో ఓట్ చోరీ జరిగిందని, ఈ విషయంలో రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో మాట్లాడారని ఆయన తెలిపారు.   

త్వరలో పార్టీ పదవులు

డీసీసీ అధ్యక్ష పదవులను త్వరలోనే హైకమాండ్ ప్రకటిస్తుందని.. పార్టీలోని ఇతర పదవుల భర్తీ కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుందని మహేశ్​గౌడ్​ వెల్లడించారు. ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వొద్దనేది ఎక్కడా లేదని, కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీ చీఫ్​ పదవులు ఇస్తామన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, మంచి సమన్వయంతోనే ఉన్నామని ఆయన తెలిపారు. కేబినెట్ విస్తరణ, శాఖల మార్పు అనేది హైకమాండ్, ముఖ్యమంత్రికి సంబంధించిన విషయమని.. ఇది తన పరిధిలోని అంశం కాదన్నారు.