బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి..ఆ పార్టీ పదేండ్ల అరాచకపాలనను ప్రజలకు వివరించాలి: మహేశ్ గౌడ్

బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి..ఆ పార్టీ పదేండ్ల అరాచకపాలనను ప్రజలకు వివరించాలి: మహేశ్ గౌడ్
  • అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తించాలి
  • జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యులకు పీసీసీ చీఫ్ దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తున్నదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. పీసీసీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఎన్నికల బాధ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్​మహేశ్ తో పాటు ఏఐసీసీ ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

ప్రచారంపై మహేశ్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. ‘‘బీఆర్ఎస్ ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలి. ప్రజలకు ఆ పార్టీ చేసిన మోసాన్ని వివరించాలి. నేతలంతా సమన్వయంతో పని చేయాలి. భారీ మెజార్టీ సాధించేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. అప్పగించిన బాధ్యతలను పక్కాగా నిర్వర్తించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి’’అని మహేశ్ గౌడ్ సూచించారు. 

పదేండ్ల బీఆర్ఎస్ అరాచక పాలనపై ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. కంటోన్మెంట్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.