ప్రభుత్వ వైఫల్యం వల్లే సిటీలో అగ్ని ప్రమాదాలు: రేవంత్​ రెడ్డి

ప్రభుత్వ వైఫల్యం వల్లే సిటీలో అగ్ని ప్రమాదాలు:  రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్​ నిలయంగా మారిందని రేవంత్​ ఆరోపించారు. ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైందని పైర్ అయ్యారు. నాంపల్లిలోని అపార్ట్​మెంట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం విచారకరమన్నారు.

అపార్ట్​మెంట్​సెల్లార్​లో కారు రిపేర్లు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. నివాస ప్రాంతంలో కెమికల్​ డ్రమ్ములను ఎలా నిల్వ చేశారని నిలదీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిఓమాండ్​ చేశారు. మృతుల కుటుంబాలకు రేవంత్​ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం తీవ్రంగా కలచివేసిందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్​ నేత ఫిరోజ్​ ఖాన్​ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడం దారుణమని భట్టి పేర్కొన్నారు.