ముందు ప్రగతి భవన్ లో సోదాలు చేయాలి

ముందు ప్రగతి భవన్ లో సోదాలు చేయాలి

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​కు కర్త, కర్మ, క్రియ కేసీఆరేనని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణం​లో ఆధారాలు దొరకాలంటే ప్రగతి భవన్​లో సోదాలు జరగాలని డిమాండ్​ చేశారు. నిజంగా ఈ స్కామ్​ను తేల్చాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ప్రగతిభవన్​లో సోదాలు చేయాలని, కేసీఆర్​ను విచారించాలన్నారు. 

మంగళవారం గాంధీభవన్​లో యూత్ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత్ జోడో యాత్ర పోస్టర్లను రేవంత్ ఆవిష్కరించారు. యాత్ర కోసం ప్రత్యేకంగా తెచ్చిన వాహనాలను ప్రారంభించి, ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని మాఫియాలకు అడ్డా ప్రగతి భవనేనని, వాటికి సూత్రధారి కేసీఆరేనని ఆరోపించారు. అక్కడ సోదాలు చేస్తే ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియాల దందాలు, కాంట్రాక్టుల్లో అక్రమాలన్నీ బయటపడతాయని చెప్పారు. వేల కోట్ల అక్రమ లావాదేవీలు వెలుగు చూస్తాయని తెలిపారు. 

ఎందుకు విచారిస్తలే? 

లిక్కర్ స్కామ్​లో టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తున్నది బీజేపీ నేతలేనని, మరి దర్యాప్తు విషయంలో కేంద్రం ఎందుకు చిత్తశుద్ధి చూపడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఆ స్కామ్​లో కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందన్నప్పుడు.. వాళ్ల ఇండ్లలో సోదాలెందుకు చేయడం లేదని అడిగారు. బీజేపీ సర్కార్ విచారణ చేయకుండా, ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా నమ్మే వెర్రివెంగళప్పలు ఎవరూ లేరన్నారు. లిక్కర్ స్కామ్​ను అడ్డంపెట్టుకొని బెదిరించి లొంగదీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 2014 నుంచి 2020 వరకు 34 మంది ఎమ్మెల్యేలను, 10 మంది ఎమ్మెల్సీలను, ఇద్దరు ఎంపీలను ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్​లోకి చేర్చుకున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధుల ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. 

రాష్ట్రంలో 15 రోజులు భారత్​ జోడో యాత్ర..

భారత్​ జోడో యాత్ర అక్టోబర్ 24, 25 తేదీల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని రేవంత్ తెలిపారు. 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని చెప్పారు. ఇది బీజేపీ విద్వేషపూరిత పాలనపై చేస్తున్న యాత్ర అని అన్నారు. సెప్టెంబర్​17పై బీజేపీ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోందని.. నిజాం సర్కారు మీద జరిగిన పోరాటాన్ని హిందూ, ముస్లిం గొడవగా చూపాలనుకుంటోందని ఫైర్ అయ్యారు. 

రేవంత్​ను కలిసిన గద్దర్.. 

కొత్త పార్లమెంట్​బిల్డింగ్​కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రేవంత్​ చెప్పారు. మంగళవారం గాంధీభవన్​లో రేవంత్​ను కలిసి గద్దర్ వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలిస్తానన్నారు.