ఉచిత కరెంట్ పై నేను అట్ల అనలేదు : రేవంత్ రెడ్డి

ఉచిత కరెంట్ పై నేను అట్ల అనలేదు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు : రాహుల్​ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం కాంగ్రెస్​ చేపట్టనున్న ‘సత్యాగ్రహ దీక్ష’ను నీరు గార్చేందుకే తనపై బీఆర్​ఎస్​ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్ర పన్నుతున్నదని అన్నారు. ఉచిత కరెంట్​కు సంబంధించి తాను అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో మంగళవారం రేవంత్​ వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘‘కాంగ్రెస్​ రైతు డిక్లరేషన్​తో బీఆర్​ఎస్​ పార్టీకి వెన్నులో వణుకు పుట్టింది. అందుకే.. అమెరికాలో నేను మాట్లాడిన మాటలపై కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నది. ఉచిత విద్యుత్​ అన్నది కాంగ్రెస్​ పేటెంట్​ స్కీం. 24 గంటల ఉచిత విద్యుత్​ ముసుగులో రైతులను మోసం చేస్తున్న కేసీఆర్​ అండ్​ కోకు కాంగ్రెస్​ను వేలెత్తి చూపించే అర్హత లేదు. బీఆర్​ఎస్​ మంత్రులు, నాయకుల చిల్లర ప్రయత్నాలకు ఒక మీడియా చానల్​ వత్తాసు పలికి మాపై దుష్ప్రచారం చేస్తున్నది. బీఆర్​ఎస్​తో పాటు ఆ చానల్​ బాగోతాన్ని బయటపెడ్త” అని ఆయన హెచ్చరించారు. 

బీఆర్​ఎస్ మళ్లీ అధికారంలోకి రాదు

వరంగల్​లో రాహుల్​ ప్రకటించిన రైతు డిక్లరేషన్​తో బీఆర్​ఎస్​ వెన్నులో వణుకు పుట్టిందని రేవంత్​ విమర్శించారు.  ‘‘కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోవడంతోనే బీఆర్​ఎస్​ మంత్రులు, నేతలు దుష్ప్రచారానికి తెరదీశారు. మళ్లీ అధికారం కోసం బీఆర్​ఎస్​ ఎంత ఆరాటపడినా.. అది దింపుడుకల్లం ఆశే అవుతుంది” అని అన్నారు.  వరంగల్​ రైతు డిక్లరేషన్​లో.. ఏకకాలంలో రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ, భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర, రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు, మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేందుకు చర్యలు, పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు, మెరుగైన పంటల బీమా పథకం అమలు, రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం, పోడు భూములు, అసైన్డ్​ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, రైతుల పాలిట శాపంగా మారిన ‘ధరణి’ పోర్టల్​ రద్దు.. అన్నిరకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు, తదితర హామీలను పొందుపరిచామని తెలిపారు. వాటిని చూశాక బీఆర్​ఎస్​పై రైతులు విశ్వాసం కోల్పోయారని అన్నారు.

కనీసం 12 గంటలైనా నాణ్యమైన కరెంట్​ ఇస్తలే

బీఆర్​ఎస్​ సర్కారు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్​ ఇవ్వడం లేదని, కనీసం 12 గంటలైనా నాణ్యమైన కరెంట్​ ఇవ్వడం లేదని రేవంత్​ విమర్శించారు. కానీ, 24 గంటలూ ఉచిత కరెంట్​ ఇస్తున్నట్టు బీఆర్​ఎస్​ పార్టీ కలరింగ్​ ఇస్తున్నదని, అందుకు నిరసనగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లోనూ విద్యుత్​ సబ్​స్టేషన్ల ముందు నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్​ కేడర్​కు ఆయన పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లలోనే విద్యుత్​ సంస్థలను కేసీఆర్​ రూ. 60 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, విచ్చలవిడి అవినీతికి పాల్పడి వాటిని దివాలా తీయించిన ఘనత కేసీఆర్​దేనని మండిపడ్డారు. దీనిపై అమరుల స్థూపం వద్ద తాము చర్చకు సిద్ధమని, కేసీఆర్​ ఆయన టీం సిద్ధమా అని రేవంత్​ సవాల్​ విసిరారు. ‘‘బీజేపీకి బీఆర్​ఎస్​ బీ టీంగా మారిందన్న రాహుల్​ గాంధీ మాట అక్షరసత్యం. కిషన్​రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఆ ఫెవికాల్​ బంధం మరింత గట్టిపడింది. ప్రధాని  మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసే కుట్రలో భాగంగానే.. నాపై దుష్ప్రచారం చేస్తూ మోదీని కాపాడేందుకు బీఆర్​ఎస్​ ప్రయత్నిస్తున్నది” అని ఆయన ఆరోపించారు.