TSPSC పేపర్ లీకేజీ : సిట్ ముందుకు రేవంత్ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీ : సిట్ ముందుకు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాసేపట్లో సిట్ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే తన ఇంటి నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లినట్లు తెలస్తోంది. హిమాయత్ నగర్ లో ఉన్న సిట్ ఆఫీసుకు రేవంత్ రెడ్డి వెళ్తున్న క్రమంలో.. పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. TSPSC పేపర్ లీకేజీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంతో ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మార్చి 23వ తేదీన సిట్ ఎదుట హాజరై.. TSPSC పేపర్ లీకేజీపై పలు ఆధారాలను రేవంత్ రెడ్డి అందించనున్నారు. 

ప్రస్తుతం హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ ఆఫీస్ కు వెళ్లే రెండు దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ రాకుండా పోలీసులు భద్రత పెంచారు. రేవంత్ వాహనాన్ని మాత్రమే సిట్ కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించనున్నారు. ఇప్పటికే కార్యాలయానికి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం బయట పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. 

ముందస్తు అరెస్ట్ లు 

రేవంత్ రెడ్డి సిట్ ముందు హాజరవుతుండటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే లింగోజిగూడ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని చైతన్యపురి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్రపై విచారణ చేయకుండా... ప్రతిపక్ష పార్టీ నాయకులను విచారణ కు పిలవడం ఏంటని దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. 

సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హిమాయత్ నగర్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డికి నోటీసులకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సిట్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకురాలు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

మరో ముగ్గురు అరెస్ట్ 

TSPSC పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. TSPSCలో పని చేస్తున్న రమేష్ కుమార్, శమీమ్, సురేష్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులు సైతం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి 100కి పైగా మార్కులు పొందినట్లు విచారణలో గుర్తించారు సిట్ అధికారులు. పేపర్ లీకేజ్ ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్ రాశారని పోలీసులు చెబుతున్నారు. TSPSCలో పనిచేసే 26 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారని గుర్తించారు. TSPSCలో పని చేస్తున్న 30 మందికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమానితులందరినీ విచారించి.. వారి పాత్రపైనా ఆరా తీయనున్నారు. 

మార్చి 23వ తేదీన మరోసారి సిట్ విచారణకు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి హాజరుకానున్నారు. మరోవైపు.. 9 మంది నిందితులకు మార్చి 23వ తేదీతో కస్టడీ విచారణ ముగియనుంది. మరోసారి కస్టడీకి తీసుకోవడానికి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. ఆరు రోజుల పాటు తొమ్మిది మంది నిందితులను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో 9 మందితో పాటు మరో ముగ్గురిని సైతం అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులను మార్చి 23న వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం నాంపల్లి కోర్టులో నిందితులను ప్రవేశపెట్టనున్నారు.