బీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలు : రేవంత్ రెడ్డి

బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో రాజ్ భవన్ వేదికగా ఆ ఇద్దరు నాటకాలకు తెర తీశారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ పచ్చి అబద్ధాలతో కేసీఆర్‭ను ప్రశంసించారని రేవంత్ మండిపడ్డారు. ఇప్పటి వరకు అనేక విషయాల్లో కేసీఆర్ పనితీరును చెండాడిన గవర్నర్.. ఇప్పుడు స్వరం ఎందుకు మార్చారని ప్రశ్నించారు. కేటీఆర్ క్యాట్ వాక్, డిస్కో డాన్స్‭ల గురించి మాట్లాడుకుంటే మంచిదని... దేశ భద్రత, సంస్కృతి ఆయనకు తెలియదని రేవంత్ విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‭కు లేదన్న ఆయన.. కాంగ్రెస్‭కు దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని కేసీఆర్‭కు ఇవే చివరి ఎన్నికలని, అందుకే ఈ రోజు కొడుకుకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చారని అన్నారు.

6 నుంచి పాదయాత్ర

ఫిబ్రవరి 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారాలమ్మ నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది రోజుల పాటు పాదయాత్ర చేస్తానని చెప్పారు. గతంలో చేవెళ్ల నుంచే వైఎస్సార్ పాదయాత్ర చేపట్టారని.. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర మొదలైందని అన్నారు. ఆనాడు రాజులు, రాచరికం మీద పోరాడిన సమ్మక్క, సారాలమ్మ స్ఫూర్తితోనే ఈ యాత్ర చేపడుతున్నానని స్పష్టం చేశారు. 

ఇంటింటికి రాహుల్ సందేశం

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే తెలిపారు. రాహుల్ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఈ నెల 6న ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. భట్టి, మధుయాష్కీ, ఉత్తమ్, ఇతర ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రను మొదలుపెడతారని అన్నారు. రెండు నెలల పాటు సాగే యాత్రలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల అసంబద్ధ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని మానిక్ రావ్ ఠాక్రే ప్రకటించారు.