- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికీ నోటీసులు జారీ
- ఎల్బీనగర్ నేత జక్కడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. సురేఖ కూతురు సుస్మిత బుధవారం వరంగల్ జిల్లా గీసుకొండలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఇతర నేతల మీద తీవ్ర ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పందించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండ సురేఖను బాధ్యురాలిగా చేస్తూ నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
స్వయంగా మంత్రి కూతురు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల కింద వనపర్తిలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మంగళవారం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చిన్నారెడ్డిని ఆదేశించింది. ఇక కులాల పేరుతో పలువురిని వ్యక్తిగతంగా దూషించినట్టు ఆధారాలు ఉండడంతో ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత జక్కడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. గత నెలలో ఎల్బీనగర్ లో యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ ను జక్కడి ప్రభాకర్ రెడ్డి కులం పేరుతో దూషించాడని ఆమె పీసీసీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
