రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు 

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు 

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణ’ అనే అంశంపై జరిగిన అఖిల పక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు రాత్రిపూట కాదు కదా పట్టపగలు కూడా బయట తిరగలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఘటన విషయంలో ఓ సీఎంగా కేసీఆర్ స్పందించకపోవడాన్ని రేవంత్ తప్పుబట్టారు.  మహిళలు, బాలికలపై ఇన్ని దాడులు జరుగుతున్నా... సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతి పక్షాలు, పౌర సంఘాలు, మహిళా సంఘాల నేతలతో సమీక్ష నిర్వహించి... వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన సీఎం ఫామ్ హౌజ్ లో నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయంలో బాలికపై అత్యాచారం జరిగితే... దేవుడి పేరుతో రాజకీయాలు చేసే పార్టీ నాయకులు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒక్కటై జూబ్లీ హిల్స్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆయన... అందులో భాగంగానే కారు వీడియో రిలీజ్ చేశారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఘటనకు సంబంధించిన నిందితుల్లో 8 మందిలో ఆరుగురిపైనే కేసులు పెట్టారని తెలిపారు. మిగతా ఇద్దరు ఏమయ్యారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపేవాళ్లే నేరగాళ్లుగా మారారని మండిపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై పట్టుకోసం డ్రగ్ ఇన్వెస్టిగేషన్ చేశారని, యువరాజుకు పట్టు వచ్చాకా డ్రగ్స్ కేసు నీరుగార్చారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. శాంతి భద్రతలు క్షీణిస్తుండటంతో హైదరాబాద్ కు పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తులు, రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా  కేసీఆర్ పాలన సాగుతోందన్నారు.  కేసీఆర్‌ చెప్పుచేతల్లో ఉండేవారికే పోస్టింగ్‌లు ఇస్తున్నారని,  నచ్చినోళ్లకు నజరానా, నచ్చనోళ్లకు జరిమానా వేస్తున్నారని మండిపడ్డారు. నలుగురు ఐపీఎస్‌ల చేతుల్లోనే 15 శాఖలున్నాయని, కేసీఆర్‌కు ఫేవర్ చేయడానికే వీళ్లంతా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన అధికారులను పక్కనపెట్టడం దారుణమని రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బాధితులకు భరోసా కలిగించేలా... నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.