మోదీ స్పీచ్​పై ఈసీ చర్యలు తీసుకోవట్లే : నిరంజన్

మోదీ స్పీచ్​పై ఈసీ చర్యలు తీసుకోవట్లే : నిరంజన్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ప్రధాని మోదీ చేసిన కామెంట్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. అమేథీలో రాహుల్ పోటీ చేయకుండా రాయ్ బరేలీ పారిపోయారని, అమేథీలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ భయపడిందని వెస్ట్ బెంగాల్ ప్రచారంలో మోదీ అన్నారని గుర్తు చేశారు.

ఈ కామెంట్లపై ఈసీకి కాంగ్రెస్ నేతలతో పాటు తాను ఐదు సార్లు ఫిర్యాదు చేశామని, ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. శనివారం గాంధీ భవన్​లో నిరంజన్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని సెక్యులర్ పదాన్ని తొలగిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ అన్నారని, దీంతో బీజేపీ అసలు రూపం బయటపడిందన్నారు. 400 సీట్లు గెలిచి రాజ్యాంగం మార్చాలని పెద్ద కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ భావాలతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.