
- కుల గణనపై క్రెడిట్ కాంగ్రెస్‌దేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయిలో జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా చేపట్టాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బలమైన సంకల్పం ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులగణన అమలు చేసి దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన నిర్ణయం ఘనత రాహుల్‌కే దక్కుతుందని, అందుకే జాతీయ స్థాయిలో ఆయన హీరో అయితే, రాష్ట్రంలో రేవంత్ హీరో అని కొనియాడారు. మోదీ నిర్ణయం బట్టి చూస్తే రాహుల్ ఎంత ముందు చూపుతో ఉన్నారనేది అర్థం అవుతోందన్నారు.
కులగణన మోదీ చేయకుంటే రాహుల్ ప్రధాని అయ్యాక తప్పకుండా చేసేవారని చెప్పారు. బీజేపీ నేతలు ఎంతమొత్తుకున్నా దేశంలో ఈ క్రెడిట్ అంతా రాహుల్‌కు, రాష్ట్రంలో రేవంత్‌కు దక్కుతుందని అన్నారు. బీజేపీ ఖాతాలోకి మాత్రం పోదని చెప్పారు. కులగణనలో ఇతర మతాల వారు ఉండరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం కాదు, ప్రధాని మోదీ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.