కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది

కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది
  • మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకుంటలే
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు : ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటున్నదని  పీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ జగ్గారెడ్డి అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉప కులాలు కూడా ఆర్థిక అభివృద్ధి కావాలన్నదే రాహుల్ ఆలోచన అని తెలిపారు. మంగళవారం గాంధీ భవన్​లో వనపర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత శాంతయ్యతో పాటు మరో150 మంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరికి జగ్గారెడ్డి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు.  ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 14 సీట్లు గెలిపించాలని, లోకల్ నేతలతో కలిసి సమన్వయంతో పనిచేయాలని కొత్తగా చేరిన నేతలకు జగ్గారెడ్డి సూచించారు. ఎన్నికల్లో తక్కువ సీట్లు  వస్తాయనే ఉద్దేశంతో మోదీ, అమిత్ షా రిజర్వేషన్లపై హిందువులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

మోదీ మాట్లాడే అబద్ధాలకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో కానీ సూపర్ అంటూ ఎద్దేవా చేశారు. మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నోటీసులు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నదన్నారు. బీజేపీ ఇంటి సంస్థగా ఈసీ మారిందని ఆరోపించారు. మీడియాలో కనపడడానికే  రేవంత్ గురించి హరీశ్ రావు  మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.