- కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాలేదుకానీ, ఆ పార్టీ నేతలు మాత్రం ఉప ఎన్నికల మత్తులో ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా.. ఆ పార్టీ నేతలకు ఏమాత్రం అహంకారం తగ్గలేదని విమర్శించారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత జిల్లా అని చెప్పుకునే మెదక్ లో కూడా ఓటమిపాలయ్యారని, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ఎక్కడున్నారో అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు ఎందుకు గౌరవించట్లేదని, ఉప ఎన్నికలు వస్తాయని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టట్లేదన్నారు. కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ‘‘అధికారంలో ఉంటే ఫాం హౌస్, ప్రతిపక్షంలో ఉంటే ఉప ఎన్నికల నినాదమా? బీఆర్ఎస్ ది గల్లీ పార్టీ. మాది ఢిల్లీ పార్టీ. మమ్మల్ని ప్రశ్నించే స్థాయి బీఆర్ఎస్ కు ఎక్కడిది”అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తమ హైకమాండ్ ఢిల్లీలో ఉంటున్నందున.. అక్కడికి వెళ్లడంలో తప్పేముందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా గోబెల్ ప్రచారాన్ని బంద్ చేయాలని, అబద్ధాల ప్రచారం ఆపాలని సూచించారు.
