బెల్టు షాపులొద్దన్నందుకు మహిళలపై పీడీ కేసులా?

బెల్టు షాపులొద్దన్నందుకు మహిళలపై పీడీ కేసులా?

హైదరాబాద్, వెలుగు: బెల్టు షాపులు వద్దని ఉద్యమం చేసినందుకు మహిళలపై పీడీ కేసులు పెట్టి వేధిస్తారా అని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ మండిపడ్డారు. చెన్నూరులో బెల్టు షాపులు, అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం షాపులు విపరీతంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​ అండదండలతోనే వాటిలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. 

బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు వద్దని ఉద్యమించిన సామాజిక కార్యకర్త రుమాండ్ల రాధిక సహా 11 మంది మహిళలపై పీడీ కేసులు పెట్టడం దారుణమని ఫైర్​ అయ్యారు. మహిళలకు కేసీఆర్​ సర్కారు ఇస్తున్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. మహిళలపై పెట్టిన కేసులను, అక్రమంగా నడిపిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే ఎత్తేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే కాంగ్రెస్​ పార్టీ తరఫున ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.