- రూ.15.70 కోట్ల విలువైన సీఎమ్మార్ దారి మళ్లించడంతో చర్యలు
- రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న నిందితుడు
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని దారి మళ్లించిన కేసులో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన రైస్ మిల్లర్ గంప సంతోష్ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంతోష్ కుమార్‌కు పీడీ యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈ ఉత్తర్వులను లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ కలిసి లక్షెట్టిపేట సబ్ జైలులో ఉన్న నిందితుడికి అందజేశారు. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
దండేపల్లి మండలం లింగాపూర్‌లోని ఎంఎస్ రామలక్ష్మణ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్న సంతోష్ కుమార్.. 2022–23, 2024–25 యాసంగి సీజన్లలో మొత్తం 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొందారు. ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా, కేవలం 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించాడు.
ఇంకా 4,452.548 మెట్రిక్ టన్నుల అందించాల్సి ఉండగా, 6,170.643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.15.14 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలను కలుపుకుని మొత్తం నష్టం రూ.15.70 కోట్లుగా నిర్ధారించారు. తెలిపారు. సంతోష్‌పై 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి సీఎంఆర్ అక్రమాల్లో రెండు కేసులు నమోదవగా ప్రస్తుతం లక్సెట్టిపేట సబ్ జైలులో శిక్షఅనుభవిస్తున్నాడు. బెయిల్‌పై విడుదలైతే మళ్లీ ఇదే తరహా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు.
