
-జైలుకెళ్లొచ్చినా రాని మార్పు
గ్యాంగ్‌స్టర్ నయీం ఖాన్ మృతిచెందినా అతనికి సంబంధించిన అక్రమాలు మాత్రం తగ్గడంలేదు. అతని పేరు అడ్డుపెట్టుకుని భూ కబ్జాలు, బ్లాక్‌మెయిల్స్ మళ్లీ మొదలుపెట్టారు నయీంభార్య, ముఠా సభ్యులు. జైలుకెళ్లి శిక్ష అనుభవించినా మారకుండా మళ్లీ పాతదారిలోనే వెళ్తున్న నయీం భార్యతోపాటు మరో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. భునవగిరి సంజీవనగర్‌కు చెందిన నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ అలియాస్ శ్రీను(46) సుమారు 105 కేసులలో నిందితుడని పేర్కొన్నారు. ఇతనిపై 2016లో జిల్లా కలెక్టర్ పీడి యాక్ట్ నమోదు చేసి 12 నెలల పాటు జైలుకు తరలించారు. బయటకు వచ్చి మళ్లీ నేరాలను చేస్తుండడంతో మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో మళ్లీ పీడీ యాక్ట్ నమోదు చేశారు.
సంస్థాన్‌నారాయణపురంలో నివసించే ఎండీ అబ్దుల్ నసీర్ (42) కూడా సుమారు 87 కేసులలో నిందితుడు. 2017లో రాచకొండ సీపి పీడి ఆక్ట్ కింద జైలుకు పంపారు. అయినా మారకుండా కిడ్నాప్‌లు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ తాజాగా మరో 4 కేసుల్లో నిందితుడిగా మారారు. భువనగిరికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఫాహీమ్(40)పై కూడా నమోదు చేశారు. అలాగే నయీం భార్య హసీనాబేగం అలియాస్ నసీమా అలియాస్ దివ్య అలియాస్ వదినమ్మ (40)పై 2006 నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కిడ్నాపింగ్, ల్యాండ్ గ్రాబింగ్, దోపిడీ లాంటి 29 కేసులలో నిందితురాలు కావడంతో 2017లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలయిన అనంతరం మళ్లీ క్రిమినల్ యాక్టివిటీస్ మొదలు పెట్టడంతో తాజాగా నాలుగు కేసుల్లో జైలుకు పంపించారు. శిక్షలు అనుభవించినా వారి పద్ధతి మార్చుకోకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వీరిపై సోమవారం పీడీ ఆక్ట్ నమోదు చేశామని చెప్పారు రాచకొండ సీపీ వివరించారు.