హుజూరాబాద్‌ లో 350 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

 హుజూరాబాద్‌ లో 350 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత
  • పరకాల నుంచి గుజరాత్​కు తరలిస్తున్నట్లు గుర్తింపు

హుజూరాబాద్‌, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని హుజూరాబాద్‌ శివారులో పోలీసులు గురువారం పట్టుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌ రోడ్డు పరకాల క్రాస్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన లారీని ఆపారు. డ్రైవర్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో లోడ్‌ను తనిఖీ చేయడంతో బియ్యం బయటపడ్డాయి. 

పీడీఎస్‌ బియ్యంగా అనుమానించిన పోలీసులు సివిల్‌ సప్లై ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బియ్యం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా పీడీఎస్‌ బియ్యంగా తేలింది. హనుమకొండ జిల్లా పరకాలలోని ఓ రైస్‌ మిల్‌ నుంచి బియ్యాన్ని గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 350 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, లారీ ఓనర్‌ శ్రావణ్‌కుమార్‌, డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని సివిల్‌ సప్లై గోదాములకు తరలించారు. తనిఖీల్లో డీటీసీఎస్‌ వసంతరావు, సివిల్‌ సప్లై ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.