సైనికులు లేకుండా దీపావళిని జరుపుకోలేను.. : ప్రధాని మోడీ 

సైనికులు లేకుండా దీపావళిని జరుపుకోలేను.. : ప్రధాని మోడీ 

ప్రపంచ శాంతికి తాము అనుకూలమని కార్గిల్‌ సైనికులతో ప్రధాని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని దాన్ని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగిస్తుందని చెప్పారు. లంకలో జరిగినా, కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు యుద్ధాన్ని నిరోధించడానికే ప్రయత్నిస్తామని స్పష్టంచేశారు. కార్గిల్‌లో సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

సైనికులను తన కుటుంబంగా సంబోధించిన ప్రధాని.. వారు లేకుండా తాను దీపావళిని జరుపుకోలేనన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి ధైర్యసాహసాలను కొనియాడారు. ఉగ్రవాదంపై పోరును కొనియాడుతూ.. వారి ధైర్యానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయని అన్నారు. కార్గిల్‌లో మన సైనికులు తీవ్రవాదాన్ని అణిచివేశారని, ఆ ఘటనకు తానే సాక్షినని చెప్పారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్న మోడీ.. జవాన్లకు స్వీట్లు తినిపిస్తూ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో సైనికులు వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలు చేయగా.. ప్రధాని మోడీ వారితో గొంతు కలిపారు.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి వివిధ సైనికదళాలతో దీపావళిని జరుపుకుంటున్న ప్రధాని మోడీ.. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి దీపావళి వేడుకలను కార్గిల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి మోడీ పండగ సంబరాల్లో పాల్గొంటున్నారు. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనగా.. 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్‌ లో చేసుకున్నారు. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్షిల్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు సైనికులతో కలిసి ప్రధానమంత్రి దీపావళిని జరుపుకున్నారు. 2019లోనూ మోడీ నియంత్రణ రేఖ వద్ద సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభించిన 2020 సంవత్సరంలోనూ జైసల్మేర్‌లోని లోంగేవాలా పోస్ట్‌లో సైనికులతో కలిసి ప్రధాన మంత్రి దీపావళిని జరుపుకున్నారు. ఈ సారి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కార్గిల్ సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.