జైలులో ఉన్న ఇరాన్ హక్కుల కార్యకర్తకు శాంతి నోబెల్

 జైలులో ఉన్న ఇరాన్ హక్కుల కార్యకర్తకు శాంతి నోబెల్
  • నార్గిస్ మొహమ్మదికి ప్రతిష్టాత్మక ప్రైజ్ 
  • మహిళల అణచివేత, మరణశిక్షలపై పోరాటం
  • 13 సార్లు అరెస్ట్.. 5 సార్లు జైలు
  • నిరుడు హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో కీలక పాత్ర
  • అప్పటి నుంచీ టెహ్రాన్ జైలులో మగ్గుతున్న నార్గిస్

ఓస్లో (నార్వే): ఇరాన్ ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొంటూ, ఏండ్ల తరబడి జైలులో మగ్గుతున్నా.. మానవ హక్కుల పరిరక్షణ కోసం మడమతిప్పని పోరాటం చేస్తున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. అడుగడుగునా ప్రభుత్వ ఆంక్షలకు ఎదురీదుతూ మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించిన నార్గిస్ ను ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేసినట్లు శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీ ఓస్లోలో ప్రకటించింది. 

ఇరాన్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ, మరణ శిక్షలకు, మహిళలపై అణచివేతలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నార్గిస్ మొహమ్మది (51) అత్యంత కీలక పాత్ర పోషించారని జ్యూరీ చైర్మన్ రీస్ అండర్సన్ కొనియాడారు. ఆ దేశంలో జరిగిన హక్కుల ఉద్యమానికి ఈ అవార్డు ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. హక్కుల ఉద్యమం మరింత ముందుకు సాగేందుకు ప్రోత్సాహకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. 

ఈ ఏడాది వ్యక్తులు, సంస్థల పేర్లతో 350 నామినేషన్లు రాగా, వాటిలోంచి నార్గిస్​ను విజేతగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అయితే, నార్గిస్​కు నోబెల్ ప్రైజ్​ విషయంపై ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థల నుంచి ఎలాంటి కథనాలు ప్రసారం కాలేదు. కొన్ని అనధికారిక మీడియా సంస్థలు మాత్రమే విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ నార్గిస్​కు నోబెల్ వచ్చిందని పేర్కొన్నాయి. 

జైలు నుంచే ఉద్యమ గొంతుకగా.. 

నార్గిస్ ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్​లో రాజకీయ ఖైదీలను ఉంచే అతి కఠినమైన ఇవిన్ ప్రిజన్​లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆమె ఇప్పటివరకు 13 సార్లు అరెస్ట్ కాగా, 5 సార్లు జైలు శిక్ష పడింది. మొత్తంగా ఆమెకు 31 ఏండ్ల జైలు శిక్షను, 154 కొరడా దెబ్బల శిక్షను ఇస్లామిక్ కోర్టులు విధించాయి. గతేడాది సెప్టెంబర్​లో హిజాబ్ ధరించలేదన్న కారణంతో మహ్షా అమినీ అనే యువతిని ఇరాన్ మోరల్ పోలీసులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 

దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులతో ఘర్షణల్లో 500 మంది చనిపోయారు. దాదాపు 22 వేల మంది అరెస్ట్ అయ్యారు. ఈ నిరసనల్లో పాల్గొన్నందుకు నార్గిస్  కూడా జైలు జీవితం గడుపుతున్నారు. జైలులో నుంచే ఆమె న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు రాస్తూ తన గొంతు వినిపిస్తున్నారు. 

శాంతి నోబెల్ పొందిన 19వ మహిళ.. 

నోబెల్ అవార్డుల 122 ఏండ్ల చరిత్రలో జైలులో లేదా హౌస్ అరెస్ట్​లో ఉన్న వ్యక్తికి శాంతి బహుమతిని ప్రకటించడం ఇది ఐదోసారి. అలాగే నోబెల్ శాంతి బహుమతిని పొందిన 19వ మహిళగా, రెండో ఇరానియన్ మహిళగా నార్గిస్ నిలిచారు. ఇంతకుముందు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాది 2003లో ఈ అవార్డును పొందారు. షిరిన్ ఎబాది స్థాపించిన ‘డిఫెండర్స్ ఆఫ్​హ్యూమన్ రైట్స్ సెంటర్ ఇన్ ఇరాన్’ సంస్థలో చేరిన నార్గిస్ ఆమె బాటలోనే నడిచారు.

 ఇరాన్ ప్రభుత్వం నిషేధించిన ఈ సంస్థకు నార్గిస్ వైస్ ప్రెసిడెంట్​గా ఉన్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నార్గిస్ హక్కుల ఉద్యమంతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 2018లో ఆండ్రీ శాఖరోవ్ ప్రైజ్​ను పొందారు. పెన్ అమెరికా సంస్థ ఇచ్చే ‘పెన్/బార్బీ ఫ్రీడమ్ టు రైట్ అవార్డ్’ కూడా ఆమెను వరించింది.

హక్కుల ఉద్యమానికి గుర్తింపు 

నేను కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉద్యమానికి ప్రపంచ మద్దతు, గుర్తింపుతో మరింత స్ట్రాంగ్ అయ్యాను. నాపై బాధ్యత మరింత పెరిగింది. భవిష్యత్తుపై ఆశలు కూడా పెరిగాయి. ఇరాన్ లో మార్పు కోసం పోరాడుతున్న నాతో పాటు ప్రతి ఒక్కరూ ఈ గుర్తింపుతో స్ట్రాంగ్ అయ్యారు. మరింత కలిసికట్టుగా ఉద్యమించేలా స్ఫూర్తి పొందారు. గెలుపు ఎంతో దూరంలో లేదు.

 - నార్గిస్ మొహమ్మది  

అవార్డుతో పరిస్థితేం మారదు ఇరాన్ లో ఇటీవలి ఆందోళనల నినాదమైన ‘విమన్, లైఫ్ అండ్ ఫ్రీడమ్’ అనే పదాలను జ్యూరీ చైర్మన్ రీస్ అండర్సన్ నోటి వెంట వినగానే.. నా సోదరికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని అర్థమైంది. ఎంతో గర్వంగా అనిపించింది. నార్గిస్​కు ఈ అవార్డు రావడం అంటే.. ఇరాన్​లో జరుగుతున్న హక్కుల ఉద్యమాన్ని ప్రపంచం గుర్తించినట్లే. అయితే, ఈ ప్రైజ్​తో ఆ దేశంలో పరిస్థితి మారదు.

- హమీద్రెజా మొహమ్మది, నార్గిస్ సోదరుడు