- ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, పలు మున్సిపాలిటీల్లో మందకొడిగా సాగిన పోలింగ్
- స్ట్రాంగ్ రూములకు తరలిన బ్యాలెట్ బాక్సులు
- రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం
మహబూబ్‌నగర్/వనపర్తి/నాగర్‌కర్నూల్/గద్వాల/మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5, నారాయణపేట జిల్లాలో 74.52, వనపర్తి జిల్లాలో 75, గద్వాల జిల్లాలో 84.69, నాగర్‌కర్నూల్ జిల్లాలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు బుధవారం ఎన్నికలు జరుగగా, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
అప్పటికే ఇంకా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. పోలింగ్ సమయం పూర్తి కాగానే ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బ్యాక్సులను ఆఫీసర్ల ఎదుట సీల్ చేశారు. అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బ్యాకులను తెరిచి ఓట్లను లెక్కించనున్నారు. కాగా, పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఒకటి, రెండు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.
మందకొడిగా ప్రారంభమై..
పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా ఓటర్లు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఉదయం 9 గంటల వరకు 12.36 శాతమే పోలింగ్ జరుగగా, 11 గంటల వరకు 27.7 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 44.58 శాతం, మూడు గంటలకు 57.63 శాతం, సాయంత్రానికి 67.73 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
భూత్పూర్ మున్సిపాల్టీలోనూ ఉదయం 9 గంటల వరకు 12.21 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత పుంజుకుంది. మొత్తంగా ఈ మున్సిపాల్టీలో 84.85 శాతం పోలింగ్ నమోదైంది. దేవరకద్రలో ఉదయం తొమ్మిది గంటల వరకు 17.81 శాతం పోలింగ్ జరుగగా, 11 గంటలకు వరకు 43.56 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 85.51 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలోని మున్సిపాల్టీలోనూ ఇదే తరహా పోలింగ్ కొనసాగింది.
కేంద్రాలను విజిట్ చేసిన కలెక్టర్లు, ఎస్పీలు
పోలింగ్ సందర్భంగా కార్పొరేషన్‌తోపాటు ఆయా మున్సిపాలిటీల్లోని పోలింగ్ స్టేషన్లను కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, సంతోష్, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి సందర్శించారు. ఓటు హక్కునూ వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయా జిల్లాల ఎస్పీలు డి.జానకి, వినీత్ పోలింగ్, సునీతారెడ్డి, శ్రీనివాసరావు, ఎస్పీ సంగ్రామ్ సింగ్ సెంటర్లను విజిట్ చేశారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సిబ్బంది సూచనలు చేశారు.
చెదురుమదురు ఘటనలు ఇలా..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఎన్నికల నేపథ్యంలో పలు చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 45 డివిజన్లోని ఓట్లు తారుమారు అయ్యాయని ఉదయం కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు పోలింగ్ నిలిచి పోయింది. వెంటనే అలర్ట్ అయిన ఆఫీసర్లు ఓటర్ లిస్టును చెక్ చేశారు. లిస్ట్‌లో ఎలాంటి పొరపాట్లు లేకపోవడంతో పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు.
కార్పొరేషన్‌లోని 39వ వార్డు పరిధిలో ఉన్న మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
నూతనంగా ఏర్పాటైన మద్దూరు మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో లీడర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 14, 15, 16వ వార్డుల్లో పోలింగ్ కేంద్రం ఆవరణ లోపల ఉన్న లీడర్లను ఇక్కడి నుంచి వెళ్లిపోయాలని పోలీసులు చెప్పడంతో లీడర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 1వ,8వ,9వ,19వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు పోలింగ్ సెంటర్లో ప్రచారం నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు అభ్యంతరం తెలిపారు. ఒకరినొకరని తోసేసుకున్నారు.
నాగర్‌కర్నూల్ 14,15వార్డులో కాంగ్రెస్,బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 14ఏండ్ల వయస్సున్న బాలికతో కాంగ్రెస్ నాయకులు ఓటేయిస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు అభ్యంతరం తెల్పడంతో ఓటు వేయడానికి వచ్చిన మహిళలు అక్కడి నుంచి పరుగులు తీశారు. 14వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని ఆయన మాజీ అనుచరులు దుర్భాషలాడారు.
కల్వకుర్తిలోని 16వ వార్డులో ఓటర్ల వేలికి పెట్టిన ఇంక్ పోతుందని అక్కడి అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
