ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల 

ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల 

పల్లి రైతులు ప్రతిసారి ట్రేడర్లు, కమీషన్​ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మన రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్​జిల్లాల్లో పల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉమ్మడి పాలమూరులో గత వానకాలం 3.80 లక్షల ఎకరాల్లో పల్లి సాగైంది. డిసెంబరు చివరి వారం నుంచి పంట మార్కెట్​కు రాగా,  మొదట ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ రూ.6,377 కంటే ఎక్కువ  రూ.8,300 నుంచి రూ.9,200 వరకు చెల్లించారు.  మార్కెట్​లోకి పల్లి రావడం పెరగ్గానే వ్యూహం ప్రకారం ధర తగ్గించారు. జనవరి రెండో వారం తర్వాత  రేట్లు డౌన్ చేస్తూ వచ్చారు. రోజూ క్వింటాల్​కు రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గిస్తూ ఫైనల్​గా మేలు రకం పల్లికి రూ.5 వేల కు తెచ్చి రైతులను మోసం చేశారు.  

దీనికితోడు పంటను మార్కెట్​కు తెస్తే అన్ని ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. కాంటాల సమయంలో హమాలీలు, చాట కూలీలకు కలిపి రూ.2 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. వేరుశనగను కుప్పలుగా పోసినందుకు ఆ స్థానానికి అద్దె కింద కుప్పకు రూ.250 నుంచి రూ.300 వరకు మార్కెట్​కు కడుతున్నారు. కాంటా జోకేటోళ్లకు సంచికి రూ.5, ట్రేడర్ల నుంచి గోనె సంచులను తీసుకున్నందుకు ఒకదానికి అద్దె కింద రూ.6  కడుతున్నారు. ఇవి కాకుండా కమీషన్ ఏజెంట్​కు నూటికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నారు.