రైతు ఉద్యమం తాత్కాలికంగా విరమణ.. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వెల్లడి

రైతు ఉద్యమం తాత్కాలికంగా విరమణ.. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వెల్లడి

వైరా, వెలుగు : వైరా రిజర్వాయర్ కు నాగార్జున సాగర్  జలాలు విడుదల చేసి ఆయకట్టు పరిధిలో ఇరవై వేల ఎకరాల్లో పంటలు కాపాడాలంటూ డిమాండ్  చేస్తున్న రైతులు తమ ధర్నాను తాత్కాలికంగా విరమించారు. ఈనెల 20న దీక్షను విరమిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తెలిపారు. శుక్రవారం బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సమావేశంలో రాంబాబు మాట్లాడారు. వైరా రిజర్వాయర్  ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో  అక్టోబర్ 30న వైరాలో,  31న జిల్లా కలెక్టర్  కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించామని ఆయన చెప్పారు. ఆయకట్టు పరిధిలో పంటలు రక్షించాలని అధికారులకు వినతిప్రతాలు అందజేశామని తెలిపారు. 

అలాగే ఈనెల 16న  వైరా ఐబీడీఈ కార్యాలయం వద్ద ఎండిపోతున్న వరి దుబ్బులతో నిరసన వ్యక్తం చేశామన్నారు. శనివారం నుంచి దశలవారీగా ఉద్యమానికి పిలుపు ఇవ్వడంతో  ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించారని వెల్లడించారు. వైరా రిజర్వాయర్  నుంచి మిషన్ భగీరథకు ఉపయోగించిన నీటికి ప్రత్యామ్నాయంగా నాగార్జున సాగర్ జలాలు విడుదల చేస్తామని చెప్పడంతో మహా ధర్నా విరమించామని, సోమవారం నుంచి జరగాల్సిన రైతు నిరవధిక దీక్ష తాత్కాలికంగా విరమించామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మిషన్  భగీరథ కోసం 14 అడుగుల మేర నీరు నిల్వ ఉండాలన్న నిబంధన రద్దు కోసం రైతు ఉద్యమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు,  మాజీ ఎంపీపీ బొంతు సమత తదితరులు పాల్గొన్నారు.