న్యూఢిల్లీ,వెలుగు: జ్ఞానేశ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కాదని, బీజేపీ ఎన్నికల కమిషనర్‌గా మారిపోయారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. 13 కోట్ల ఓట్ల చోరీపై ప్రశ్నిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య ఖూనీ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు దాదాపు 240 మంది విపక్ష ఎంపీలు వస్తే జ్ఞానేశ్ కుమార్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. విపక్ష ఎంపీల అరెస్టులను ఎంపీ ఖండించారు. చొరబాటుదారుల ఓట్లను తొలగించామని బీజేపీ పదేపదే చెబుతోందని, 12 ఏండ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కారే ఈ చొరబాట్లను ఎంకరేజ్ చేసిందా? అని ప్రశ్నించారు. కేవలం బీజేపీ కార్యకర్తలకు ‘ఫామ్-7’ ద్వారా వేలాది ఓట్లు తొలగించే అనుమతిని జ్ఞానేశ్ కుమార్ ఇచ్చారని ఆరోపించారు.
