ఓటు చోరీపై ఎంతవరకైనా పోరాడ్తం..ప్రజల గళాన్ని ఎన్నటికీ అణచివేయలేరు: ఎంపీ వంశీకృష్ణ

ఓటు చోరీపై ఎంతవరకైనా పోరాడ్తం..ప్రజల గళాన్ని ఎన్నటికీ అణచివేయలేరు: ఎంపీ వంశీకృష్ణ
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: ఓటు చోరీపై ఎంతవరకైనా పోరాడుతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పౌరుల ఓటు హక్కులను హరించడం, ఎస్ఐఆర్​ ను దుర్వినియోగం చేయడాన్ని తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌‌‌‌లో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్​నుంచి  బస్​లో ర్యాలీకి బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎంపీ  వంశీకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రజల గళాన్ని ఎన్నటికీ అణచివేయకూడదని, ప్రజాస్వామ్యం తప్పక గెలవాలన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వేలాది మంది అంకితభావం గల కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో న్యూఢిల్లీ వీధుల్లోకి రావడం తమకు గర్వంగా ఉందన్నారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతని గుర్తుచేశారు.