నేను వజ్రాన్ని.. ఎక్కడికీ పారిపోలె

నేను వజ్రాన్ని.. ఎక్కడికీ పారిపోలె
  •     ఎమ్మెల్యే శ్రీధర్​బాబు డబ్బులిచ్చి ప్రచారం చేస్తున్నారు
  •     నన్ను లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నరు.. నేను ఆగను గాక ఆగను
  •     వామన్​రావు హత్య కేసు విచారణ పూర్తయ్యాక హైదరాబాద్​లో ప్రెస్​మీట్​ పెడతా
  •      టీఆర్ఎస్​ మెంబర్​షిప్​ నమోదు కార్యక్రమంలో పుట్ట మధు కామెంట్స్‌‌

పెద్దపల్లి, వెలుగు‘‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఎవరికీ మొహం చాటేయలేదు. టీఆర్ఎస్​ హైకమాండ్ ​నన్ను పిలవలేదు. నాకు కేసీఆర్, కేటీఆర్ అపాయింట్​మెంట్​ తిరస్కరించారన్న ప్రచారం నిజం కాదు” అని పెద్దపల్లి జడ్పీ చైర్​పర్సన్​ పుట్ట మధు అన్నారు. హైకోర్టు లాయర్లు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య తర్వాత పుట్ట మధు తొలిసారిగా స్పందించారు. మంథని మండల టీఆర్ఎస్​ మెంబర్​షిప్​ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇస్తున్న డబ్బులకు అమ్ముడుపోయి కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ పెద్దలు అపాయింట్​మెంట్ ఇవ్వలేదంటూ కొందరు పిచ్చికూతలు కూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలోని బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు తన స్థాయికి ఎదిగే వరకు పోరాటం చేస్తానన్నారు.

పూర్తి జీవితం టీఆర్ఎస్​ కోసమే..

‘‘నేను మంథని మట్టి బిడ్డను. రేషం కల్ల బిడ్డను. నేను వజ్రాన్ని. నేను మోసగాడ్ని కాదు. మొన్నటి వరకు కుటుంబం అంతా ఉన్నం. బిడ్డకు, కొడుకుకు పెండ్లి చేసిన. ఇక ఏం పనిలేదు. నా పూర్తి జీవితకాలం టీఆర్ఎస్​ పార్టీ కోసం, మంథని నియోజకవర్గ ప్రజల కోసమే. ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తొత్తులు నన్ను లోపలపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎన్ని చేసినా నేను ఆగను గాక ఆగను..” అని పుట్ట మధు స్పష్టం చేశారు. శ్రీధర్​బాబు పేపర్లను, టీవీలను అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తున్నారని.. తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ కొందరిని కొనుగోలు చేసి ఎలా గెలుస్తుందో అందరికీ తెలుసని కామెంట్​ చేశారు. మంథని చరిత్రలో ఒక బీసీ ఇంతగా ఎదగడాన్ని శ్రీధర్​బాబు సహించడం లేదని.. బీసీ బిడ్డ అయిన తాను ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్​ అయినందుకు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. శ్రీధర్​బాబు డబ్బులకు అమ్ముడుపోయిన కొన్ని టీవీలు, పేపర్లు తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వామన్​రావు హత్య కేసు విచారణ పూర్తయిన తర్వాత హైదరాబాద్​లో ప్రెస్ మీట్​పెట్టి ఆ పేపర్, టీవీల పేర్లు చెప్తానన్నారు. అసలు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, అతని తండ్రి ఎలా పైకి వచ్చారో నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యేలా చెప్తానని, వారి అవినీతి బాగోతాన్ని బయటపెడ్తానని పేర్కొన్నారు.