
హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోలు కాంట్రాక్టర్లు రైస్ మిల్లర్ల దగ్గర వసూలు చేసిన డబ్బులను విశాఖపట్నంలోని బ్యాంకుల్లో దాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. డబ్బులు తెలంగాణ నుంచి విశాఖపట్నానికి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే 250 మంది మిల్లర్లు కాంట్రాక్టర్ల అకౌంట్లలో డబ్బులు జమ చేశారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మిల్లర్ల నుంచి వసూలు చేసిన డబ్బును వెంటనే సీజ్ చేయాలన్నారు. సివిల్ సప్లయ్స్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. సీఎం పేషీ నుంచే సివిల్ సప్లయ్స్ అవినీతి జరిగిందని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. డబ్బులు వేయని మిల్లర్లను డీఫాల్టర్లుగా ప్రకటిస్తామని, విజిలెన్స్ దాడులు చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లయ్స్ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.