పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి

పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి
  •     సెక్రటేరియెట్​ముందు మాజీ సర్పంచ్ ల నిరసన 
  •     అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్​కు తరలింపు

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. సెక్రటేరియెట్ ముందు నిరసన దీక్ష చేశారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఐదేండ్ల పాటు 12,769 పంచాయతీల్లోని సర్పంచులు అప్పులు చేసి, ఇంట్లో ఆడవాళ్ల మీది బంగారం తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. 

ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులకు రూ.1,500 కోట్ల బిల్లులు రిలీజ్ చేయాల్సి ఉందని చెప్పారు. బిల్లులు రాక ఐదేండ్లలో 50 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాగా, ఆందోళన చేస్తున్న  మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. కొంతమంది మాజీ సర్పంచులు పోలీసుల కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. పెండింగ్​ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  సర్పంచుల జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్, జనరల్ సెక్రటరీ ప్రణీల్ చందర్ డిమాండ్ చేశారు

ప్రజాపాలన అంటే అరెస్టులా?: హరీశ్​ రావు

‘పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మాజీ సర్పంచులు నిరసన చేస్తుంటే అరెస్ట్ చేస్తారా?  ప్రజా పాలన అంటే గ్రామాలకు సేవ చేసిన వారిని అరెస్ట్ చేయడమా?’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు ప్రశ్నించారు. అరెస్ట్ అయిన మాజీ సర్పంచులను బొల్లారం పీఎస్ లో ఎమ్మెల్యేలు హరీశ్​ రావు, గంగుల కమలాకర్, లక్ష్మారెడ్డి పరామర్శించారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద బంగారం అమ్మి గ్రామాభివృద్ధి కోసం పనిచేసి.. పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని విమర్శించారు. బిల్లులు రిలీజ్ చేసే వరకు బీఆర్ఎస్​తరఫున పోరాడుతామని పేర్కొన్నారు.