లబ్ధిదారులకు ఈ నెల నుంచే పెరిగిన పింఛన్

లబ్ధిదారులకు ఈ నెల నుంచే పెరిగిన పింఛన్

రాష్ట్రంలో పెంచిన ‘ఆసరా’ పింఛన్లు ఈ నెల నుంచే లబ్ధిదారులకు అందనున్నాయి. రెండు, మూడు రోజుల్లో సొమ్ము అకౌంట్లలో జమకానుంది. కానీ ఈ నెలలో కొత్తగా లబ్ధిదారులెవరికీ పింఛన్లు అందడం లేదు. వృద్ధాప్య పింఛన్​ వయసు పరిమితి తగ్గించిన నేపథ్యంలో సుమారు ఏడు లక్షల మంది కొత్తగా అర్హత పొందారు. వారంతా పింఛన్​ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక అయిపోయింది. హైదరాబాద్​లో మాత్రం ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఫైనల్​ లిస్టు సిద్ధం కాలేదు. దాంతో కొత్త పింఛన్ల మంజూరు జాప్యం కానుంది.

ఎలక్షన్​ హామీ మేరకు..

ఆసరా పింఛన్లను డబుల్​ చేస్తామని, వృద్ధాప్య పింఛన్ వయసును 57 ఏళ్లకు తగ్గిస్తామని అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్​లోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా పింఛన్ల పెంపు అమల్లోకి రాకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. దాంతో చివరికి గత నెలలో వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్​ను రూ.1,000 నుంచి రూ.2,016 కు, వికలాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల నుంచి లబ్ధిదారులకు అందనున్నాయి. ఇప్పటివరకు 39 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా.. రూ.5 వేల కోట్లు వ్యయమయ్యేది. పింఛన్ల మొత్తం పెంపు, అర్హత వయసు తగ్గింపుతో వచ్చే కొత్త లబ్ధిదారులకు కలిపి.. రూ.12 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ మేరకు సర్కారు ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసింది.

వరుస ఎన్నికలతో జాప్యం…

అసెంబ్లీ ఎలక్షన్లలో వినియోగించిన ఓటర్ల జాబితా ఆధారంగా కొత్తగా వృద్ధాప్య పింఛన్​ లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ వరుసగా ఎలక్షన్లు రావడంతో ఎంపికలో జాప్యం జరిగింది. మరోవైపు అనారోగ్యం, ఇతర కారణాలతో మరణిస్తున్న వారితో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోంది. ఏప్రిల్​లో 10 వేల మంది, జూన్​లో మరో 7,820 మంది తగ్గినట్లు సెర్ప్ అధికారులు చెబుతున్నారు.