20 తారీఖు వచ్చినా పింఛన్​​ పైసలు పడలే

20 తారీఖు వచ్చినా పింఛన్​​ పైసలు పడలే
  • బ్యాంక్​ అకౌంట్​ ఉన్నవాళ్లకు అందని ఆసరా
  • ప్రభుత్వం ఫండ్స్​ రిలీజ్​చేయకే ఆగినయ్​
  • బ్యాంకుల చుట్టూ తిరిగిపోతున్న లబ్ధిదారులు

మెదక్, వెలుగు: ప్రతి నెలా మొదటి వారంలో అకౌంట్లలో జమ కావాల్సిన ఆసరా పింఛన్లు  20 రోజులైనా పడకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇంటి అవసరాలకు, మందులకు దిక్కులు చూస్తున్నారు. ఆసరా పథకం కింద లబ్ధిదారుల్లో కొందరికి పోస్టాఫీస్ ద్వారా, కొందరికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వం పింఛన్​ చెల్లిస్తోంది. కానీ గత మూడు నెలలుగా పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నవారికి నెల ప్రారంభంలోనే పింఛన్​ పైసలు వస్తున్నా, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి మాత్రం లేట్​అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో లబ్ధిదారులు దినాం బ్యాంకుల చుట్టూ తిరిగిపోతున్నారు.  

ప్రతి నెలా 800 కోట్లకుపైనే.. 
రాష్ట్రవ్యాప్తంగా  37,72,350 మందికి ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ .845.54 కోట్లు చెల్లిస్తోంది. అందరికీ బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోస్టాఫీస్ ల ద్వారా పింఛన్​​చెల్లించే ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోస్టాఫీస్​లో అకౌంట్​లేనివారికి కొత్తగా అకౌంట్లు కూడా తెరిపించారు. ప్రస్తుతం పోస్టాఫీస్​ల ద్వారా  సుమారు 20.74 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. మిగితా లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు. పోస్టాఫీస్​అకౌంట్​ఉన్నవారికి నెల మొదటి వారంలో పింఛన్​పైసలు పడుతున్నా బ్యాంక్​అకౌంట్​ఉన్నవారికి మాత్రం రెండు, మూడు వారాలు దాటుతోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో ఫండ్స్​రిలీజ్​చేయకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.

మెదక్ లో లబ్ధిదారుల ఆందోళన
మెదక్ జిల్లాలో పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న 47,345 మందికి పింఛన్​పడగా,  బ్యాంక్  అకౌంట్ ఉన్న 57,277 మందికి 11.99 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో సోమవారం శివ్వంపేటలో లబ్ధిదారులు బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత ఎంపీడీఓ వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. జనగామ మున్సిపల్ పరిధిలోని 5,449 మంది ఆసరా లబ్ధిదారుల అకౌంట్లలో మంగళవారం వరకు పైసలు పడలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో 28,263 మందికి 6.14 కోట్లు రావాల్సి ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో  1.10 కోట్ల పింఛన్లు పెండింగ్​పడ్డాయి. ఖమ్మం జిల్లాలో 1.58 లక్షల మందికి ఇంకా పెన్షన్ రాలేదు. మంచిర్యాల జిల్లాలో 35 వేల మందికి ఇంకా అకౌంట్ లో డబ్బులు జమ కాలేదు.

మందు గోళీలకు తక్లీఫ్​ అయితుంది
ఇరవై రోజులైనా పింఛన్​ పైసలు పడలేదు. చేతిల పైసల్లేక మందు గోళీలకు చానా తక్లీఫ్​ అయితుంది.  పైసలు చేతికందక యాకాశి పండుగ సామాన్లు తెచ్చుకోలేకపోయినం. తండా నుంచి రోజు సైకిల్​ మీద బ్యాంకు కాడికి వచ్చి పోతున్నా. పింఛన్​ పైసలు ఇంకెప్పుడు వస్తయో ఏమో.
-చందర్​నాయక్​, చిన్నగొట్టిముక్ల తండా, మెదక్​ జిల్లా