భూతల దాడులకు అమెరికా సన్నాహాలు..    ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ ఆరోపణ

భూతల దాడులకు అమెరికా సన్నాహాలు..    ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖలీబాఫ్ ఆరోపణ

టెహ్రాన్: అమెరికా శాంతి చర్చల పేరుతో రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ ఆరోపించారు. ఆయన ఒక లిఖిత పూర్వక ప్రకటనలో ఈ ఆరోపణలు చేసినట్టు ఇరాన్​ ప్రభుత్వ న్యూస్​ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. ఇరాన్ ఒక పెద్ద ప్రపంచ యుద్ధంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉందని, అమెరికాను పశ్చాత్తాపపడేలా చేస్తామని పేర్కొన్నారు.

‘‘మన బలగాలు అమెరికా సైనికుల రాకకోసం వేచి ఉన్నాయి,  వారు వస్తే నేలమట్టం చేస్తం, వారి ప్రాంతీయ మిత్రులను శాశ్వతంగా శిక్షిస్తం” అని ఖలీబాఫ్ హెచ్చరించారు. అమెరికా- ఇరాన్ యుద్ధం 30వ రోజుకు చేరిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ పరిధిలోకి 3,500 మంది మెరైన్లు యూఎస్ఎస్ ట్రిపోలి నౌకపై పశ్చిమాసియాకు చేరుకున్నారు. వీరితో పాటు యుద్ధ విమానాలు, అంఫిబియస్ (నీటిలో, నేలపై పోరాడే) బలగాలు కూడా వచ్చాయి.

ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచన అమెరికా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఆ ద్వీపం నుంచే జరుగుతున్నది. అయితే ఖర్గ్ ద్వీపం స్వాధీనం సాధ్యమేనా అని అమెరికా రక్షణ నిపుణులు పరిశీలిస్తున్నారు. అమెరికా మిలటరీ వ్యూహకర్తల అభిప్రాయం ప్రకారం, మోహరిస్తున్న బలగాల సంఖ్య చూస్తే ఇది దీర్ఘకాలిక భూతల యుద్ధానికి సంకేతం కాదని, పరిమిత, వేగవంతమైన కార్యకలాపాలకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోందని అంటున్నారు.

అయితే, ఇరాన్ కూడా ఖర్గ్​లో తన రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంటోందని ఇంటెలిజెన్స్​ రిపోర్టులు చెబుతున్నాయి. మరోవైపు, తమకు చర్చలపై అభ్యంతరం లేదు, కానీ నష్టపరిహారం తప్పనిసరి అని ప్రభుత్వ ప్రతినిధి ఫాతేమ్ మొహజిరానీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.