కుక్కల దాడులు.. పాముకాట్లు..13,070 మంది కుక్కల దాడి బాధితులు

కుక్కల దాడులు.. పాముకాట్లు..13,070 మంది కుక్కల దాడి బాధితులు
  • 562 మందికి పాముకాటు 
  • డాగ్ ​బర్త్​ కంట్రోల్ ​సెంటర్​కు తాళం
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇదీ పరిస్థితి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కుక్కల దాడులు, పాముకాట్లతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గత మూడేండ్లలో 13,070 మంది కుక్కల దాడిలో గాయపడగా ముగ్గురు మృతిచెందారని, 562 మంది పాము కాటుకు గురయ్యారని వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.  

గుంపులు గుంపులుగా శునకాలు..

కుక్కలు, కోతుల నియంత్రణకు కొత్తగూడెం కార్పొరేషన్​తో పాటు ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు ప్రతీ బడ్జెట్​లో లక్షలు కేటాయిస్తున్నాయి. ఆ డబ్బులు ఏమవుతున్నాయో తెలియడం లేదు. 2022–23లో 3,550, 2023–24లో 3,994, ఈ ఏడాది ఇప్పటివరకు 5,526 మంది కుక్క కాటుకు గురయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్​ పరిధిలో శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.

 పిల్లలు పాఠశాలలకు వెళ్లే, ఇంటికి వచ్చే సమయాల్లో ఎక్కడ దాడి చేస్తాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదిన్నర కింద కుక్క కాటుతో సుజాతనగర్​ మండలం లక్ష్మీదేవిపల్లి తండాలో ఐదేండ్ల చిన్నారి నిహారిక మృతిచెందింది. పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో ముత్తిపోయిన సందీప్(25) రేబిస్​వ్యాధితో మంగళవారం చనిపోయాడు. 

ఈ నెల 4న టేకులపల్లి మండలం మురుట్లకు చెందిన వజ్జా లక్ష్మయ్య పొలం పని చేస్తుండగా పాముకాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుక్క కరిస్తే సరైన చికిత్స పొందాలని  వైద్యులు చెబుతున్నారు. కలెక్టరేట్​తోపాటు సింగరేణి మెయిన్​హాస్పిటల్, కొత్తగూడెంలోని పలు గవర్నమెంట్ఆఫీసుల వద్ద కుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.    

ఏటా పెరుగుతున్న పాముకాటు కేసులు

జిల్లాలో పాము కేసులు ఏటా పెరుగుతున్నాయి. మూడేండ్లలో 562 మంది పాము కాటుకు గురయ్యారు. 2022-–23లో 256, 2023–-24లో 126, ఈ ఏడాది ఇప్పటివరకు 180 కేసులు నమోదయ్యాయి. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన లెక్కలు. ప్రైవేట్ హాస్పటల్స్​లో, ఆర్ఎంపీల వద్ద ట్రీట్​మెంట్​తీసుకుంటున్నవారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో గత మూడు నెలల్లో స్నేక్​ రెస్క్యూ బృందాలు ఇండ్లలోకి వచ్చిన పదుల సంఖ్యలో పాములను పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు. 

సెంటర్​ నిరుపయోగం

కొత్తగూడెంలో మూడేండ్ల కింద లక్షల రూపాయలతో డాగ్​ బర్త్​ కంట్రోల్​సెంటర్​నిర్మించారు. కానీ ఏడాదిగా దానికి తాళాలు వేశారు. ఫలితంగా కుక్కల సంతానం పెరుగుతుండటంతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. 

డాగ్ బర్త్​ కంట్రోల్​ సెంటర్​ప్రారంభిస్తాం

పాల్వంచలో డాగ్ బర్త్ కంట్రోల్​సెంటర్​ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభిస్తాం. కుక్కల సంచారంపై కార్పొరేషన్​ ఆఫీస్​లో సమాచారం ఇస్తే శానిటరీ సిబ్బంది వచ్చి పట్టుకెళ్తారు. – సుజాత, కమిషనర్​, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​