గ్రేటర్‌‌‌‌ ప్రచారానికి ఊర్ల నుంచి జనం

గ్రేటర్‌‌‌‌ ప్రచారానికి ఊర్ల నుంచి జనం
  •     గ్రామాల నుంచి కార్యకర్తలు, నేతలను దింపుతున్న పార్టీలు
  •     అడ్డా కూలీలను  ప్రచారానికి పిలుస్తలేరు!

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీల నేతలు ఊర్ల  నుంచి జనాన్ని పట్టుకొస్తున్నరు. కార్యకర్తలు, వార్డు మెంబర్లు, సర్పంచ్‌‌‌‌ల దగ్గర్నుంచి మండల, జిల్లా నాయకులు, ముఖ్య లీడర్లను గ్రేటర్‌‌‌‌లో దింపుతున్నరు. రాజకీయాల గురించి తెలిసి ఉండటంతో వాళ్లతోనే ప్రచారం చేయిస్తున్నరు. యూత్‌‌‌‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌‌‌‌ ఇస్తున్నరు. యువకులు తమ వెంటే ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నరు. ప్రచారం చేసేటోళ్లకు రోజుకు వెయ్యి రూపాయలు, బీరు, బిర్యానీ ఇస్తున్నరు.

వైట్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌ చోటామోటా లీడర్లే

ఈసారి ప్రచారంలో క్యాండిడేట్ల వెంట వైట్ అండ్ వైట్ చోటామోటా లీడర్లు, కార్యకర్తలే బాగా కనిపిస్తున్నారు. రాజకీయ అవగాహన ఉండటంతో వాళ్లనే లీడర్లు ప్రచారానికి వాడుకుంటున్నరు. తమ పార్టీ చేసిన, చేయబోయే పనులను ఓటర్లకు వాళ్లు వివరిస్తున్నారు. విమర్శలు ఎదురైనా ఓపిగ్గా సమాధానం చెబుతున్నారు. అడ్డా కూలీలు జెండా పట్టుకుని తిరగడం తప్ప ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేయలేరని కార్యకర్తలు, లీడర్లతో క్యాంపెయిన్‌‌‌‌ చేయిస్తున్నారు.

అడ్డా కూలీలను పిలుస్తలేరు

ఎన్నికలొచ్చాయంటే జన సమీకరణకు లేబర్ అడ్డాల మీద వాలిపోయే నేతలు.. ఈ దఫా జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వారిని పిలవట్లేదు. అన్ని ప్రధాన పార్టీల నేతలు ఊర్లల్లోని కార్యకర్తలు, చోటామోటా లీడర్లను క్యాంపెయిన్‌‌‌‌కు వాడుకుంటున్నరు. ప్రతి ఎన్నికల సీజన్‌‌‌‌లో చేతినిండా పని దొరికేదని, ఈసారి ఏ పార్టీ నేతలు పిలవవట్లేదని కూలీలు నిరాశ చెందుతున్నారు. లాక్‌‌‌‌డౌన్ తర్వాత భవన నిర్మాణ పనులు ఊపందుకోలేదని, అక్కడా పని దొరకట్లేదని.. ఎన్నికల టైమ్‌‌‌‌లోనూ పని లేదని వాపోతున్నరు. ఈ పది రోజులైనా పని దొరకుతుందనుకుంటే ఇటు వైపు వచ్చిన లీడరే లేడని నింబోలి అడ్డాకు చెందిన కూలీ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

సిటీలో 92 ఏరియాల్లో లేబర్‌‌‌‌ అడ్డాలు

జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో అశోక్‌‌‌‌నగర్, చిక్కడపల్లి, చైతన్యపురి, సరూర్‌‌‌‌నగర్, కూకట్‌‌‌‌పల్లి, మియాపూర్, శివం రోడ్డు, నాగోల్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్ తదితర 92 ఏరియాల్లో లేబర్‌‌‌‌ అడ్డాలున్నాయి. ఒక్కో అడ్డా దగ్గర రోజుకు 100 –2‌‌‌‌‌‌‌‌00 మంది కూలీలు పనుల కోసం వస్తుంటారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌కు ముందు వీళ్లలో సగం మందికైనా పని దొరికేది. ఇప్పుడు రోజుకు 50, 60 మందికి మించి పని దొరకట్లేదు. ఇలాంటి టైమ్‌‌‌‌లో వచ్చిన జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికలతో 10 రోజులైనా పని దొరుకుతుందని కూలీలు అనుకున్నా ఊర్ల నుంచి నేతలు, కార్యకర్తలను తీసుకొస్తుండటంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.