కారేపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండలంలోని మాదారం గ్రామంలో సీసీ రోడ్లు, వీవో భవనం నిర్మాణాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ, 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి వేగవంతమైందన్నారు.
రైతుల సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
