బీజేపీ జుమ్లా పార్టీ.. ఈ సారి 200 సీట్లు కూడా రావు: కేసీ వేణుగోపాల్

బీజేపీ జుమ్లా పార్టీ.. ఈ సారి 200 సీట్లు కూడా రావు: కేసీ వేణుగోపాల్

కేరళ: సౌత్ ఇండియాపై ప్రధాని నరేంద్ర మోదీ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కేరళకు వచ్చినప్పుడు కేరళను పొగుడుతారని..  నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు విమర్శిస్తారని మండిపడ్డారు.  ప్రస్తుతం కేరళలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేసీ వేణుగోపాల్.. ఏప్రిల్ 11వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని.. మా గ్యారంటీలను నమ్ముతున్నారని చెప్పారు.

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినప్పటి నుండి దేశం అంతటా మా అవకాశాలు మెరుగవుతున్నాయని, కాంగ్రెస్, ఇండియా పొత్తుపై పాజిటీవ్ రిపోర్టులు వస్తున్నాయని వేణుగోపాల్ తెలిపారు.  మా హామీలు, మేనిఫెస్టోను విమర్శించేందుకు బీజేపీకి ఏం సాకులు దొరకడంలేదన్నారు. తాము ప్రజల సమస్యలపై మాట్లాడినప్పుడల్లా ప్రధాని పక్కదారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ జుమ్లా పార్టీ అని ప్రజలు గుర్తించారని ఆయన చెప్పారు. 

ప్రజలు ఆశించిన పాలనను బీజేపీ అందించడంలేదని..  దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కేసీ వేణుగోపాల్. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుస్తుందని చెబుతున్నారని.. ఎన్నికలకు ముందే తమకు ఇన్ని సీట్లు వస్తాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశ ప్రజలు బీజేపీని నమ్మడంలేదని.. వారికి 200 సీట్లు కూడా రావని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరూ ఊహించలేరని కేసీ చెప్పారు.