ట్యునీషియాలో నీళ్ల గోస.. దేశంలో సాగు, తాగు నీటికి తీవ్ర కరువు

ట్యునీషియాలో నీళ్ల గోస.. దేశంలో సాగు, తాగు నీటికి తీవ్ర కరువు
  •     నీళ్ల వాడకంపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం
  •     వర్షాలు కురవక ఎండిపోతున్న పంటలు
  •     ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణుల ఆందోళన

టూనిస్ (ట్యునీషియా): ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియాలో కరువు విలయతాండవం చేస్తోంది. నీటి కోసం జనం గోస పడుతున్నరు. మంచినీళ్లకు సైతం తీవ్ర కటకట ఏర్పడింది. దేశంలోని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్​లో ప్రభుత్వం తాగునీళ్లకు కోటా విధానం తీసుకొచ్చింది. రేషన్ మాదిరిగా నీటిని కొలిచి ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికే వ్యవసాయానికి నీటి వినియోగంపై నిషేధం విధించింది. ట్యునీషియా నాలుగేండ్లుగా తీవ్ర కరువుతో అల్లాడుతోంది. దేశంలోని డ్యామ్‌లలో 30 శాతం మాత్రమే నీళ్లు మిగిలి ఉన్నాయి. నీటి సంరక్షణలో భాగంగా కార్లను కడగడం, చెట్లు, మొక్కలకు నీళ్లు పోయడంపై కూడా నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడానికి నీటిని వాడడంపై బ్యాన్ పెట్టారు. ఈ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించింది. ఎవరైనా వాటర్ యాక్ట్ లోని రూల్స్ పాటించకపోతే ఫైన్ లేదా జైలు శిక్ష కూడా విధిస్తామని స్పష్టంచేసింది. ట్యునీషియా నీటి చట్టం ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించిన వారికి 6 రోజుల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, తాగునీళ్ల కోటాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

పడిపోతున్న ధాన్యం ఉత్పత్తి..

నార్త్​ ఆఫ్రికా రీజియన్ లో మూడో అతిపెద్ద ఉత్పాదక దేశంగా ట్యునీషియా పేరొందింది. నాలుగేళ్లుగా వర్షాలు సరిగా కురవక, నీటి కొరతతో పంటల సాగు తగ్గి, ధాన్యం ఉత్పత్తి పడిపోతూ వస్తోంది. ఏప్రిల్​ 2 నుంచి మే 10 వరకు నలభై రోజుల పాటు చుక్క వర్షం కూడా కురవకపోవడంతో చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని వ్యవసాయరంగ నిపుణులు చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంతో పాటు నార్త్​ ఆఫ్రికాలోని పలు రీజియన్లలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశంలో ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం కూడా తీవ్ర స్థాయిలో పెరిగి అక్కడి జనం అరిగోస పడుతున్నారు.