పీకే మీతో ఉంటే గొప్పోడు.. మాతో ఉంటే తప్పా

పీకే మీతో ఉంటే గొప్పోడు.. మాతో ఉంటే తప్పా

హైదరాబాద్‌‌, వెలుగు: బీజీపీ సారథ్యంలోని ఎన్డీఏ హయాంలో అచ్చేదిన్ కాదని, సచ్చే దిన్ వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. తప్పనిసరిగా భవిష్యత్‌‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌‌ఎస్‌‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బుధవారం ఆయన టీఆర్‌‌ఎస్‌‌ ప్లీనరీలో, అంతకుముందు మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగులు, రైతులకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ పండించిన యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా అన్నదాతలను అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయని, చేతల విషయానికొస్తే ఎక్కడా కనిపించవని దుయ్యబట్టారు. 12, 13 రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వస్తున్నారని, డబుల్ ఇంజన్ ఉన్న యూపీ నుంచి తెలంగాణకు వలస వస్తున్నారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీతో ఉంటే గొప్పోడని, తమతో ఉంటే తప్పా అని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్ర ప్రజలు లేక వెలవెలబోతున్నదని చెప్పారు. పాదయాత్రలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ రేట్లు పెరిగాయని బండి సంజయ్‌‌ చెబుతారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని చెప్పారు. బీజేపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం మత కల్లోలాలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఏ రంగంలో చూసినా కేంద్ర వైఫల్యాలే
కనిపిస్తున్నాయన్నారు.

కేసీఆర్ లేకపోతే రైతులు ఆగమయ్యేవారు : గంగుల 

కేంద్రం యాసంగి ధాన్యం కొనే బాధ్యతల నుంచి  పారిపోయినా.. కొంటున్న సీఎం కేసీఆర్​కు అభినందనలు తెలిపే తీర్మానాన్ని మంత్రి గంగుల కమలాకర్ బలపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేకపోతే రైతు ఆగమయ్యేవాడన్నారు.

బీజేపీవి దిగజారుడు రాజకీయాలు: నిరంజన్‌‌ రెడ్డి

యాసంగి పంట  రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుచేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ టీఆర్ఎస్ విస్తృత సభ తీర్మానిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్రం సానుకూలంగా స్పందించక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో సీఎం వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారు ధాన్యం సేకరించక సతాయిస్తుంటే, ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు తమ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తామే విరుద్ధంగా ప్రవర్తిస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.