వెకిలి చేష్టల టీచర్​కు దేహశుద్ధి

వెకిలి చేష్టల టీచర్​కు దేహశుద్ధి
  •      భద్రాద్రి జిల్లా ఇల్లెందులో సీఆర్​టీ అసభ్య ప్రవర్తన  
  •     డబుల్​మీనింగ్​మాటలు...ఎక్కడ పడితే అక్కడ తాకుడు 
  •     కొట్టి పోలీసులకు అప్పజెప్పిన పేరెంట్స్​

ఇల్లెందు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్​టీ) విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్  ఎ.రాందాస్​ 9వ తరగతి విద్యార్థినులతో కొంతకాలంగా వెకిలి చేష్టలు చేస్తున్నాడు. భయంతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న విద్యార్థినులు తర్వాత హెచ్ఎంకు ఫిర్యాదు చేయడంతో పాటు తల్లిదండ్రులకు చెప్పారు. 

హెచ్​ఎం సువర్ణపాక పద్మావతి.. టీచర్​ వివరణ కోరగా తప్పు జరిగిందని, మళ్లీ జరగకుండా చూసుకుంటానని లెటర్​ రాసిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు రాందాస్​ను చితకబాదారు. ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ తమ పిల్లలతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ, ఎక్కడ పడితే అక్కడ కావాలని తాకుతూ ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు. ఇల్లెందు ఎస్సై పఠాన్ ​నాగుల్ ​మీరా స్కూల్​కు వచ్చి టీచర్​ను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. 

హెచ్ఎం ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదే టీచర్​ గతంలో కూడా ఇలాగే చేయడంతో అప్పటి ఐటీడీఏ పీవో, ఐటీడీఏ డీడీ, ఇల్లెందు ఏటీడీవోకు హెచ్ఎం ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు మొదటి తప్పుగా పరిగణించి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేశారు. అంతేగాకుండా అదే పాఠశాలలో టీచర్​గా కొనసాగిస్తున్నారు. దీంతో చేసిన తప్పులే మళ్లీ చేసి దొరికి తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యాడు.