వరంగల్‌‌లో ప్రజాపాలనకు పోటెత్తిన ప్రజలు

వరంగల్‌‌లో ప్రజాపాలనకు పోటెత్తిన ప్రజలు
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • హనుమకొండ జిల్లాలో 4,149, జనగామలో 10,502, మహబూబాబాద్‌‌ జిల్లాలో 15,428 అప్లికేషన్లు
  • ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు

హనుమకొండ/వరంగల్‌‌, వెలుగు : ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అప్లికేషన్లు అందజేశారు. హనుమకొండ జిల్లాలోని వరంగల్‌‌ పశ్చిమలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌రెడ్డి, పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

మొదటి రోజున జిల్లాలోని 35 గ్రామపంచాయతీలతో పాటు హనుమకొండ, పరకాల మున్సిపాలిటీల్లోని నాలుగు చొప్పున మొత్తం 8 డివిజన్ల నుంచి మొత్తం 4,149 అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. వరంగల్‌‌ జిల్లా పరిధిలోని నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట పరిధిలో కేఆర్‍.నాగరాజు కార్యక్రమాన్ని ప్రారంభించగా, మిగతా చోట్ల కలెక్టర్లు, ఇతర ఉన్నాతాధికారులు ప్రారంభించారు. మహబూబాబాద్‌‌ జిల్లాలో 15,428, జనగామ జిల్లాలో 10,502 అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు.

కౌంటర్లను పరిశీలించిన కలెక్టర్లు

జనగామ అర్బన్/ములుగు, వెలుగు : జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్లను కలెక్టర్‌‌ సీహెచ్‌‌.శివలింగయ్య, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ పర్మర్‌‌ పింకేశ్‌‌ కుమార్‌‌ తనిఖీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం రాఘవపట్నం, తాడ్వాయి మండలం వెంగలాపూర్‌‌లోని ప్రజాపాలన కౌంటర్‌‌ను కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 9 మండలాల్లో సభల నిర్వహణకు 36 టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి ఒక్కరే వచ్చి అప్లికేషన్‌‌ ఇవ్వాలని సూచించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయాలని, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రిసిప్ట్‌‌ ఇవ్వాలని ఆదేశించారు. 

రేషన్‌‌ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు

వరంగల్​సిటీ, వెలుగు : రేషన్‌‌ కార్డు లేకున్నా అభయహస్తంకు అప్లై చేసుకోవచ్చని బల్దియా కమిషనర్‌‌ షేక్‌‌ రిజ్వాన్‌‌ భాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆధార్‌‌ కార్డు జిరాక్స్‌‌ అటాచ్‌‌ చేసి అప్లై చేసుకోవాలని సూచించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరి నుంచి అప్లికేషన్‌‌ తీసుకొని రిసిప్ట్‌‌ అందజేస్తామని చెప్పారు. బ్లాక్‌‌ అండ్‌‌ వైట్‌‌ జిరాక్స్‌‌ ఫారాలతో సైతం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. 

కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ ఎంపీపీ మధ్య వాగ్వాదం

ధర్మసాగర్/రాయపర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా చింతల్‌‌ తండాలో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్న టైంలో కాంగ్రెస్‌‌ నాయకులు అక్కడికి వచ్చారు. దీంతో ‘మీరంతా ఇక్కడికెందుకు వచ్చారు, కాంగ్రెస్‌‌ పథకాల కోసమే ప్రజలు ఎదురుచూస్తున్నారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీపీ, కాంగ్రెస్‌‌ లీడర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు ఇస్తానని చెప్పిన రేవంత్‌‌ రెడ్డి ఇప్పటివరకు ఇవ్వలేదని, కాంగ్రెస్‌‌ పథకాలు పది మందికి కూడా అందవని అన్నారు. 

దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు కాంగ్రెస్‌‌ లీడర్లకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే వరంగల్‌‌ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా(ఎస్)లో జరిగిన ప్రజా పాలన గ్రామ సభలోనూ కాంగ్రెస్‌‌ లీడర్లు, ఎంపీపీ మధ్య వాగ్వాదం జరిగింది. సభలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఒక్కసారి గెలవడమే కష్టం.. అలాంటిది దయాకర్‌‌రావు ఆరు సార్లు గెలిచి అభివృద్ధి చేశాడని అన్నారు. దీంతో కొందరు కాంగ్రెస్‌‌ నాయకులు కలుగజేసుకొని దయాకర్‌‌రావు ప్రస్తావన ఇక్కడ అనవసరం అంటూ వాగ్వాదానికి దిగారు. మిగతా నాయకులు వారికి నచ్చజెప్పారు.