ఆచితూచి కొంటున్న జనం..

ఆచితూచి కొంటున్న జనం..
  • చిన్న ప్యాకెట్లే కొంటున్నరు
  • బిస్కెట్ల నుంచి నూనెల దాకా అంతా ఇంతే
  • ఖర్చు తగ్గించుకునేందుకు జనాల యత్నం
  • 5‑10 రూపాయల ప్యాకెట్ల తయారీ పై కంపెనీల దృష్టి

న్యూఢిల్లీ: ప్రతి ఒక్క వస్తువు ధర పెరగడంతో జనం ఆచితూచి కొంటున్నారు. పెద్ద ప్యాకెట్లకు బదులు చిన్న ప్యాకెట్లను, వ్యాల్యూ ప్యాకెట్లను ఎంచుకుంటున్నారు. బిస్కెట్ల నుంచి నూనె ప్యాకెట్ల దాకా అన్ని ప్రొడక్టుల కేటగిరీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని కిరాణాషాపుల వాళ్లు చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన పార్లే, డాబర్​ ఇండియా వంటి ఎఫ్​ఎంసీజీ కంపెనీలు ‘లో యూనిట్​ ప్యాక్స్’​(ఎల్​యూపీ)పై ఫోకస్​ చేస్తున్నాయి. చిన్న ప్యాకెట్లనే ఎక్కువగా మార్కెట్​లోకి తెస్తున్నాయి. బిస్కెట్లు, సాల్టీ స్నాక్స్​, బేకరీ కేటగిరీల్లో ఎల్​యూపీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని పార్లే ప్రొడక్ట్స్​సీనియర్​ కేటగిరీ హెడ్​ బుద్ధ కృష్ణారావు చెప్పారు. రూ.5, రూ.10 ప్యాక్​లకు గిరాకీ బాగా పెరిగిందన్నారు. రూ.30, రూ.60 ధర ఉన్న వ్యాల్యూ ప్యాక్స్​ కూడా బాగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. గత నెలలో కన్జూమర్​ ప్రైస్​ ఇన్​ఫ్లేషన్​ 7.79 శాతానికి చేరుకున్న నేపథ్యంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఇంత ఎక్కువగా ఇన్​ఫ్లేషన్​ రికార్డు కావడం  2014 మే తర్వాత ఇదే మొదటిసారి. డాబర్​ సీఈవో మోహిత్​ మల్హోత్రా మాట్లాడుతూ.. కిరాణా బడ్జెట్​ను తగ్గించుకోవడానికి చాలా మంది చిన్న ప్యాకెట్లు కొంటున్నారని తెలిపారు. పెద్ద ప్యాకుల కంటే రూపాయి, ఐదు రూపాయలు, రూ.20 ధరలు ఉన్న ప్యాకెట్ల అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. తమ కంపెనీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని ఏషియన్​ పెయింట్స్​, హిందుస్థాన్​ యూనిలీవర్​(హెచ్​యూఎల్​) వంటివి చెప్తున్నాయి. కస్టమర్లు వ్యాల్యూ ప్యాక్స్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నిరుడితో పోలిస్తే ఈసారి తమ అమ్మకాలు 60 శాతం పెరిగాయని అమూల్​ తెలిపింది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కస్టమర్ల చిన్న ప్యాక్​లకే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది.