చిన్నారిని బతికించేందుకు 16 కోట్లు విరాళమిచ్చిన సామాన్యులు

చిన్నారిని బతికించేందుకు 16 కోట్లు విరాళమిచ్చిన సామాన్యులు

ముంబై: మానవత్వం మిగిలే ఉంది. తమకు ఏమీ కాని.. సంబంధం లేని ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న వారంతా తలా ఒక చేయి వేశారు. తమ వంతు యాబై నుండి వంద మొదలు వేయి రూపాయలు విరాళాలుగా ఇవ్వడమేకాదు.. తమ బోటి వారందరితో చేయించారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ‘ఇంపాక్ట్ గురు’స్వచ్చంద సంస్థ చేసిన కృషి ప్రపంచ వ్యాప్తంగా 2.64 లక్షల మందిని కదిలించింది. ఎవరికి తోచినంత.. ఎవరికి చేతనైనంత వారు విరాళం పంపడమే కాదు.. తమబోటి వారితో చేయించిన తీరు చినుకుల్లా రాలి.. నదులుగా పొంగి.. వరదలా ఉవ్వెత్తున ఎగసిపడింది. కేవలం 42 రోజుల్లో 16 కోట్లు సమకూరాయి. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్ కు చెందిన ధైర్య రాజ్ సింగ్ రాథోడ్ మధ్య తరగతి జీవి. తనకు పుట్టిన మగ పిల్లాడికి అనారోగ్యంగా ఉండడంతో వైద్యులను చూపించారు. అంతుబట్టని వ్యాధి కావడంతో అక్కడి వైద్యులు ముంబైకి సిఫారసు చేశారు. బాబు ప్రాణాల కోసం వారు ముంబైలోని ప్రముఖ వైద్యులకు చూపించగా.. అరుదైన జబ్బు చేసినట్లు తేలింది. స్పైనల్ మస్కులార్ ఆంట్రోపీ టైప్-1 రుగ్మతతో బాబు బాధపడుతున్నట్లు నిర్ధారించిన వైద్యులు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బాబు బతకడని తేల్చి చెప్పారు. అయితే ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి చికిత్స చేయించుకుని బయటపడుతున్న వార్తలను వారు ధైర్య రాజ్ సింగ్ రాథోడ్ కు తెలియజేశారు. అమెరికాకు చెందిన అవెక్సన్ అనే అంకుర సంస్థ జోల్ జెన్ స్మాను అభివృద్ధి పరచిందని.. నాడీ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలు బలిగొనే ఈ వ్యాధికి ‘జోల్ జెన్ స్మా’ ఇంజెక్షన్ దివ్య ఔషధంలా పనిచేస్తోందని.. ఒకే ఒక్క ఇంజెక్షన్ వేయిస్తే సరిపోతుందని తెలిపారు. అయితే దాని ఖరీదు 16 కోట్లు అని చెప్పగానే నిరాశ కమ్మేసింది. వైద్యులు చెప్పగానే మొత్తం ఆస్తినంతా అమ్మేయాలని నిర్ణయించగా ఏ మూలకూ సరిపోవు. మరి అంత డబ్బు ఎక్కడ నుండి తేవాలో తెలియక కుమిలిపోయారు. విషయం తెలుసుకున్న  ‘ఇంపాక్ట్ గురు’ స్వచ్చంద సంస్థ స్పందించింది. బాబు ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన 16 కోట్లు సమకూరే వరకు ఆన్ లైన్.. ఆఫ్ లైన్లలో విరాళాల సేకరణను యుద్ధంలా మొదలుపెట్టారు. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా స్పందించడంతో.. కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా దావానలంలా పాకిపోయింది. బాబు ప్రాణాలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం సామాన్యులను కదిలించింది. అంతే విరాళాలు చిన్నగా మొదలై.. వరదలా వచ్చిపడ్డాయి. కేవలం 42 రోజుల్లో 16 కోట్లు వచ్చాయి. ఐదు నెలల చిన్నారి బతకించడం కోసం అవసరమైన 16 కోట్లు సమకూరగానే ఇంజెక్షన్ కు ఆర్డర్ పెట్టారు. ఒక చిన్నారి ప్రాణాలు కాపాండేందుకు ఇంత భారీ సొమ్ము సమకూరుతుందా..? లేదా..? అన్న అనుమానాలకు పటా పంచలు చేస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా సామాన్యులంతా స్పందించి తలా ఒక చేయి వేశారు. దాదాపు 2 లక్షల 64 వేల మంది స్పందించారు. వీరిలో ఎవరూ కోటీశ్వరులు కాదు.. అంతా సామాన్యులే. తమకు చేతనైనంత.. తోచినంత విరాళమిచ్చి.. ఇప్పించడంతో ముంబైలోని ఆస్పత్రిలో ప్రాణాంత వ్యాధికి చికిత్స పొందుతున్న చిన్నారికి చికిత్స మొదలైంది.