కేసీఆర్​ను ప్రజలు నమ్మరు

కేసీఆర్​ను ప్రజలు నమ్మరు
  • అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్​ ప్రీ ఫైనలే
  • హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ను కల్వకుంట్ల కుటుంబం భ్రష్టుపట్టించిందని ఫైర్​
  • టీ 20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలని డిమాండ్​
  • మునుగోడు ఉప ఎన్నికపై వివేక్​ అధ్యక్షతన బీజేపీ స్టీరింగ్​ కమిటీ భేటీ
  • మండలాల వారీగా ఇన్​చార్జులు, సహ ఇన్​చార్జుల నియామకం
  •  త్వరలో చార్జ్​షీట్​, మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికను అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్​ కమిటీ చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి అన్నారు. మునుగోడులో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టైంలో దళిత బంధు అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. అమలు చేయకుండా దళితులను దగా చేశారని ఆయన మండిపడ్డారు. ‘‘ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందున గిరిజన బంధు అని గిరిజనులకు కొత్త ఆశలు కల్పిస్తున్నడు. దళిత బంధు ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు గిరిజన బంధు ఎట్ల ఇస్తడో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి” అని వివేక్ అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచార వ్యూహం, గెలిచేందుకు పార్టీ పరంగా జనంలోకి  ఎలా వెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. మీటింగ్​లో పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కమిటీ కో–ఆర్డినేటర్ మనోహర్ రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, స్వామి గౌడ్, రవీంద్ర నాయక్, గరికపాటి మోహన్ రావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆచారి, దాసోజు శ్రవణ్, యెండల లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. మండల ఇన్​చార్జుల నియామకంపై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 6మండలాలకు, 2మున్సిపాలిటీలకు ఇన్​చార్జులను, సహ ఇన్​చార్జులను నియమిస్తున్నట్లు వివేక్  మీడియాకు వివరాలు వెల్లడించారు. మూడు, నాలుగు రోజుల్లో మళ్లీ స్టీరింగ్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికపై త్వరలోనే చార్జ్​షీట్​, మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కాగా.. ఇన్​చార్జులు, సహ ఇన్​చార్జులుగా నియమితులైన వాళ్లు 27 నుంచి వాళ్లకు కేటాయించిన మండలాలకు వెళ్లి, వారివారి ఏరియాల పరిధిలో ఎన్ని బూత్​లు ఉన్నాయి.. వాటిలో పార్టీ కమిటీలు వేసినవి ఎన్ని.. వేయనివి ఎన్ని తెలుసుకొని.. వెయ్యని బూత్​లకు కమిటీలను వేయాలని నిర్ణయించారు.

 

ఉప ఎన్నికలు ఉంటేనే కేసీఆర్​ బయటికి వస్తరు

కేసీఆర్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజల్లో కేసీఆర్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికలు ఉన్నప్పుడే కేసీఆర్ ఫామ్​హౌస్​ నుంచి బయటికి వస్తారని విమర్శించారు. దళిత సీఎం, డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. ఇలాంటి ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేశారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో  టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  ను ఓడించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినా జనం నమ్మరని, మునుగోడులో గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులో రిపీట్ అవుతాయన్నారు. 

కల్వకుంట్ల కుటుంబం వల్లనే హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ భ్రష్టు పట్టింది

కల్వకుంట్ల కుటుంబం వల్లనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ) భ్రష్టు పట్టిందని వివేక్ మండిపడ్డారు. కూతురు కవితను హెచ్‌‌‌‌‌‌‌‌సీఏకు ప్రెసిడెంట్ గా చేసేందుకు కేసీఆర్ గేమ్ ఆడారని ఆరోపించారు. ‘‘అప్పట్లో హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న నన్ను తన కూతురు కోసం పోటీ చేయొద్దని కేసీఆర్  చెప్పిండు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నీకు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్ ఎందుకు, వదులుకో అన్నడు. ఆ తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ కు అనుకూలమైన ప్యానెల్ ను గెలిపించుకున్నడు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా శిలాఫలకాలపై కల్వకుంట్ల కుటుంబం వారి పేర్లే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నరు. క్రికెట్, హాకీ, ఫుట్ బాల్...ఇలా ప్రతి దాంట్లో వాళ్లే రాజ్యమేలాలనే కుట్రతో కేసీఆర్ వ్యవహరించిండు. నేను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఐపీఎల్ వంటి ఎన్నో మ్యాచ్ లను సమర్థవంతంగా నిర్వహించాం. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు, గొడవలు చోటు చేసుకోలేదు” అని వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ఇప్పుడు ఇంత రచ్చ జరగడం, టికెట్లను బ్లాక్ చేయడానికి కారణాలేమిటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేశారు. దీనికి పోలీసులు కూడా బాధ్యులేనని స్పష్టం చేశారు. హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్ గా అజరుద్దీన్​ అసమర్థుడని, టీ 20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై వైట్ పేపర్ రిలీజ్  చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఇన్​చార్జులు, సహ ఇన్​చార్జులు వీళ్లే:

  •     చౌటుప్పల్ మండలానికి ఇన్​చార్జ్​గా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సహ ఇన్​చార్జులుగా జిట్టా బాలకృష్ణా రెడ్డి, ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు.
  •     చౌటుప్పల్ మున్సిపల్ ఇన్​చార్జ్​గా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, సహ ఇన్​చార్జులుగా సుభాష్ చందర్, ధనుంజయ్.
  •     నారాయణపూర్ మండల ఇన్​చార్జ్​గా ఎమ్మెల్యే రఘునందన్​రావు, సహ ఇన్​చార్జులుగా మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, కాసం వెంకటేశ్వర్లు. 
  •     మునుగోడు మండల ఇన్​చార్జ్​గా మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి, సహ ఇన్​చార్జులుగా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రవి కుమార్ యాదవ్. 
  •     చండూర్ మండల ఇన్​చార్జ్​గా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సహ ఇన్​చార్జులుగా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, అందె బాబయ్య. 
  •     చండూర్ మున్సిపాలిటీ ఇన్​చార్జ్​గా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సహ ఇన్​చార్జులుగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, నాగూరావు నామోజీ.
  •     నాంపల్లి మండల ఇన్​చార్జ్​గా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సహ ఇన్​చార్జులుగా అందె శ్రీరాములు, రితేశ్ రాథోడ్.
  •     మర్రిగూడెం మండల ఇన్​చార్జ్​గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సహ ఇన్​చార్జులుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జడ్పీ మాజీ చైర్​పర్సన్​ తుల ఉమ.