4 గంటలు ఎక్కడ చూసినా జనమే

4 గంటలు  ఎక్కడ చూసినా జనమే
  • 4 గంటలు గాయి గత్తర
  • మార్కెట్లు, వైన్స్, బస్సుల్లో ఎటుచూసినా జనం
  • ఉదయం 6  నుంచి 10 గంటల వరకు ఫుల్ రష్​
  • సరుకులు, కూరగాయల కోసం బారులు
  • షాపులు, మార్కెట్లలో నో ఫిజికల్ డిస్టెన్స్​

హైదరాబాద్​/ నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి లాక్​డౌన్ అమల్లోకిరావడం, పొద్దున 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఉండడంతో ఆ నాలుగు గంటలు పబ్లిక్​ఉరుకులుపరుగులు పెట్టారు. ఇట్ల తెల్లారిందో లేదో అట్ల రోడ్లపైకి వచ్చారు. నిత్యావసరాలు, కూరగాయల కోసం మాల్స్​కు, సూపర్ మార్కెట్లకు, రైతుబజార్లకు క్యూ కట్టారు. వైన్స్​ల దగ్గర బారులు తీరారు. రంజాన్ నేపథ్యంలో ముస్లింలు పండుగ షాపింగ్ చేశారు. హైదరాబాద్​సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని కూరగాయల మార్కెట్లన్నీ జనంతో కిటకిటలాడాయి. ఎక్కడా ఫిజికల్ డిస్టెన్స్ ముచ్చట లేదు. చాలా చోట్ల కార్లు, టూవీలర్స్​ బారులు తీరి ట్రాఫిక్​ జామ్ అయింది. లాక్​డౌన్ కారణంగా సొంతూర్లకు వెళ్లేందుకు జనం బస్​స్టేషన్లు, రైల్వే స్టేషన్లకు పరుగుపెట్టారు. ఒకరినొకరు తోసుకుంటున్నట్లుగా బస్సులు, రైళ్లు ఎక్కి వెళ్లిపోయారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1100 బస్సులే రోడ్డెక్కగా, వాటిలో చాలా బస్సులు జనంతో కిక్కిరిసి వెళ్లాయి. జనం బయట తిరగడం తగ్గించడం, ఫిజికల్ డిస్టెన్స్ కోసమే లాక్​డౌన్ పెడ్తే, తీరా ఆ నాలుగు గంటలు ఎక్కడా ఫిజికల్ డిస్టెన్స్​కనిపించలేదు. జనం కరోనా రూల్స్ పాటించకపోతే ఆ కొద్ది టైంలోనే వైరస్​ప్రబలే ప్రమాదముందని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

లాక్​ డౌన్​తో సిటీలు, టౌన్లలో పనులు దొరకని వారు బుధవారం పొద్దునే సొంతూర్లకు బయలుదేరారు. మబ్బుల 5 గంటల నుంచే బస్ స్టాప్, రైల్వేస్టేషన్లకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి ఊర్లకు పోయేందుకు బస్సులు, ఆటోలు, క్యాబ్​లను ఆశ్రయించారు. బస్సులు సరిపడా రాక చాలా మంది బస్టాండ్లలో గంటల తరబడి ఎదురుచూశారు. దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు చేసేది లేక ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ వాహనాల ఆపరేటర్లు డబుల్​రేట్లు వసూలు చేశారు. సాధారణంగా రోజు ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సులు నడిస్తే బుధవారం కేవలం 1100 బస్సులు రోడ్డెక్కినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ఇక రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో జనం 
ఎక్కువ కనిపించారు. 

10గంటల తర్వాత అన్నీ బంద్‌..
ఉదయం 10గంటల తర్వాత అత్యవసర సేవలు మినహా తెలంగాణ మొత్తం షట్‌డౌన్‌ అయ్యింది. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. దుకాణాలు, మార్కెట్లు, మాల్స్‌, సినిమా హాళ్లు, క్లబ్ లు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసేశారు. పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ నిలిచిపోయింది. 33శాతం స్టాఫ్‌తో సర్కారు ఆఫీసులు నడిచాయి. పెట్రోల్‌, డీజిల్‌ బంక్‌లు ఓపెన్ చేసి ఉన్నాయి. 11గంటల తర్వాత రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి చెక్​ చేశారు. ఐడీ కార్డులు చూపించిన వారిని వదిలిపెట్టారు. అనవసరంగా బయటకు వస్తే కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కొందిరికి ఫైన్‌ వేశారు. ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

బ్యాంక్ పని వేళల్లో మార్పులు
లాక్‌డౌన్‌ తో బ్యాంకుల టైమింగ్ లో మార్పులు చేశారు. గురువారం నుంచి పొద్దున 8 గంటల నుంచి పగటీలి 12 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50శాతం స్టాఫ్​తో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. బుధవారం రోజంతా పనిచేశాయి.  

పనిలేక ఇంకో దగ్గరకు పోతున్న 
మాది ఒడిశా. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ హోటల్​లో పనిచేస్త. లాక్ డౌన్ వల్ల హోటల్ క్లోజ్ చేసిన్రు. మా చుట్టాలు చేవేళ్లలో కూలి పనిచేస్తరు. ఇక్కడ నాకు పనిలేక వాళ్ల దగ్గరికి పోతున్న. మళ్లీ హోటల్ ఓపెన్​ అయినంక సిటీకి వస్త.
- జన్న శంకర్, వలస కూలి​

బస్సు దొరకలేదు
హైదరాబాద్​లో జాబ్​చేస్త. సొంతూర్లో పనిపడింది.  లాక్​డౌన్ అనడంతో బుధవారం పొద్దునే హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వెహికల్​లో కామారెడ్డికి వచ్చిన. తిరిగి హైదరాబాద్​కు పోయేందుకు బస్టాండ్​కు పోతే ఒక్క బస్సూ లేదు. 
- బాలాజీ, బోధన్, నిజామాబాద్​

నడిచే పోతాం
నాగర్​కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల, యాపట్ల గ్రామాలకు చెందిన సుమారు 80  మంది వలస కూలీలు హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరి ఉదయం 11 గంటలకు నాగర్​కర్నూల్​ బస్​స్టాండ్​లో దిగారు. తీరా అక్కడ బస్సులు, ప్రైవేట్​వెహికిల్స్ ఏమీ లేకపోవడంతో సంచిలు నెత్తిన పెట్టుకుని కాలినడకన 30, 40 కిలోమీటర్ల దూరంలోని ఊళ్లకు బయలుదేరారు. కూలినాలి చేసుకొని బతికేటోళ్లం.. చెప్పకుండా లాక్​డౌన్​పెడితే ఎట్ల ఊర్లకు పోవాలే యాపట్ల గ్రామానికి చెందిన లక్షమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. 

సిటీ జనం లైఫ్ ​స్టైల్ చేంజ్
హైదరాబాద్​లో మెజారిటీ ప్రజలకు అర్ధరాత్రి దాటాక నిద్రపోయి పొద్దున లేటుగా లేచే అలవాటు ఉంటుంది. ఉదయం 9,10 గంటల దాకా సిటీ రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ కనిపించదు. అలాంటిది లాక్​డౌన్​తో పబ్లిక్  లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారింది. బుధవారం 6 గంటలకే అన్ని రకాల షాపులు, సూపర్​ మార్కెట్లు, మాల్స్​ తెరుచుకోవడంతో నిత్యావసరవస్తువులు, షాపింగ్ కోసం పబ్లిక్​బయటికి వచ్చారు. ఎలక్ర్టానిక్​, మొబైల్​ స్టోర్స్​, బట్టల షాప్​లు కూడా ఓపెన్​చేయడంతో జనం షాపింగ్ చేస్తూ, ఫోన్లు రిపేర్లు చేయించుకుంటూ కనిపించారు. కూరగాయలు కొనేందుకు వచ్చినవాళ్లతో రైతు బజార్లు జాతరలను తలపించాయి. రంజాన్​ షాపింగ్​ కోసం వచ్చినవాళ్లతో బేగంబజార్, ఉస్మాన్ గంజ్, చార్మినార్ ఏరియాలు కిక్కిరిశాయి. అటు రైతుబజార్లతో పాటు ఇటు షాపింగ్​ఏరియాల్లో మెజారిటీ పబ్లిక్ ఎక్కడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదు.