
- కూరగాయలు, పంటల సాగుకు జంకుతున్న రైతులు
- వీటి బెడదతో ఇండ్లలో చెట్లనూ కొట్టేస్తున్నరు
- నేటికీ అతీగతీ లేని మంకీ ఫుడ్ కోర్టులు
- మనుషుల ఫుడ్‌కు అలవాటుపడుతున్నయ్
- బిహేవియర్‌లోనూ మార్పు వస్తోందంటున్న ఎక్స్పర్ట్స్
- తాజా లాక్‌డౌన్‌తో మరింతగా జనావాసాల్లోకి
నెట్‌వర్క్, వెలుగు: ఒకప్పుడు అడవులు, గుట్టల్లో తప్ప బయట కనిపించని కోతులు ఇప్పుడు పల్లెలు, పట్టణాల్లోనే తిరుగుతున్నయ్. మనుషులతోపాటే బతుకుతున్నయి. మనుషులు తినే తిండే తింటున్నయ్. అడవుల్లో దొరికేకాయలు, పండ్లు లేదంటే ఆకులు, అలములు తినేవి కాస్తా, అన్నం, చపాతీలు, బ్రెడ్డు, రకరాల స్నాక్స్ లాగిస్తున్నయ్. ఇలా ఈజీఫుడ్కు అలవాటుపడుతున్న కోతులు, అడవుల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని ఎక్స్‌ఫర్ట్స్ అంటున్నరు. వాటి బిహేవియర్‌లోనూ, ఇమ్యూనిటీలోనూ మార్పు కనిపిస్తోందని చెబుతున్నరు. మంకీ ఫుడ్‌కోర్టులను ఏర్పాటుచేసి కోతులను జనావాసాల నుంచి తరలిస్తామన్న సర్కారు, ఆ దిశగా సక్సెస్ కాలేదు. ఇటీవల లాక్డౌన్ కారణంగా అడవుల నుంచి మరిన్ని కోతులు జనావాసాలకు వచ్చాయని రైతులంటున్నారు. వాటి వల్లే కూరగాయలు, పండ్ల సాగు వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు.
ఈజీ ఫుడ్‌కు అలవాటు పడ్తున్నయ్..
మనిషి తన అవసరాల కోసం అడవులు, గుట్టలను నరికేయడం వల్ల సహజ ఆవాసాలు దెబ్బతిని మొదట్లో కోతులు బయటికి వచ్చాయి.అడవుల్లో ఉన్నప్పుడు మేడి పండ్లు, మొర్రి పండ్లు, తునికిపండ్లు, సీతాఫలాలు, ఇంకా రకరకాల కాయలు, పండ్లు, అవి లేకుంటే ఆకులు తిని బతికేవి. కానీ క్రమంగా మనిషి తినే తిండికి అలవాటు పడ్డాయి. ఇప్పుడైతే అన్నం, కోడి గుడ్లు, పేలాలు, అటుకులు, చపాతీలు, దోశెలు, బ్రెడ్డు, అన్నిరకాల స్నాక్స్ తింటున్నాయి. అందుకే వెనక్కి వెళ్లడం లేదని ఎక్స్పర్ట్స్అంటున్నారు. కవ్వాల, నల్లమల లాంటి అడవుల్లో భారీగా చెట్లు, పచ్చదనం ఉన్నప్పటికీ మనుషులు వేసే తిండి కోసం రోడ్లపైకి వస్తుండడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. లాక్డౌన్ కారణంగా అలాంటి తిండి దొరకక గ్రామాల్లోకి భారీగా వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఎటుచూసినా కోతులే..
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మంజిల్లాల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. ఒకప్పుడు అటవీ సమీప గ్రామాల్లోనే వీటి బెడద ఉండేది. క్రమంగా అన్ని ప్రాంతాలకూ పాకింది. పలు గ్రామాల్లోనైతే పరిస్థితి దారుణంగా ఉంది. జనావాసాల్లోనే స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న కోతులు, ఇటు ఇండ్లపై అటు పంట చేన్లపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. వీటిని తట్టుకోలేక చాలా మంది రైతులు పండ్లు, కూరగాయల, పప్పు ధాన్యాల సాగు మానేస్తున్నారు. వరి, పత్తి పంటలకు మారిపోతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో జామ, బొప్పాయి, దానిమ్మ చెట్లు కనిపించేవి. ఇప్పుడు కోతుల బాధకు ఎక్కడికక్కడ కొట్టేస్తుండడంతో ఇండ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకరకంగా కోతులు వీధి కుక్కలను మించిపోతున్నాయి. మనుషుల మీద ఎగబడి కరుస్తున్నాయి. దీంతో ఇండ్లు, కిరాణా షాపులకు ఇనుప జాలీలు పెట్టించుకుంటున్నారు. మొదట్లో కోతులు కొండెంగలకు భయపడేవి. దీంతో చాలా గ్రామాల్లో వేలకువేలు పోసి కొండెంగలను తెప్పించారు. ఇప్పుడు వాటినీ లెక్కచేయడం లేదని చెబుతున్నారు. పలు గ్రామాల్లో సర్పంచులు కోతులు పట్టేవాళ్లను రప్పించి, ఒక్కో కోతికి రూ.500 చొప్పున ఇచ్చి వాటిని అడవుల్లో విడిచిపెట్టారు. కానీ వారం తిరిగేలోపే అవి వాపస్వస్తున్నాయని వాపోతున్నారు.
లాక్‌డౌన్‌తో పెరిగిన సంఖ్య
లాక్డౌన్ వల్ల జనావాసాల్లోకి వచ్చే కోతుల సంఖ్య పెరిగిందని రైతులు, వెటర్నరీ డాక్టర్లు, ఫారెస్ట్ఆఫీసర్లు చెబుతున్నారు. అంతకుముందు కొండగట్టు లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రంతో పాటు రాష్ట్రంలోని చిన్న, పెద్ద అన్ని దేవస్థానాల్లో, పర్యాటక ప్రాంతాల్లో వేలాది కోతులుండేవి. లాక్‌డౌన్‌తో భక్తుల్లేక కోతులకు తిండి కరువై, అవీ ఊళ్లపై పడుతున్నాయి. ఇలా వచ్చిన కోతులు మళ్లీ తిరిగివెళ్లడం కష్టమని ఆఫీసర్లు అంటున్నారు. కరోనా కారణంగా జన సందడి లేక కోతుల్లో కలయిక టైంతోపాటు సంతతి కూడా పెరిగే చాన్స్ ఉందని, ప్రస్తుతం అదే జరుగుతోందని పశువైద్యులు చెబుతున్నారు.
ఒక కోతి.. 20 పిల్లలు
లోకల్ కోతుల లైఫ్‌టైమ్12 నుంచి 15 ఏళ్లు. రెండున్నర ఏళ్ల వయస్సు రాగానే ఆడకోతి గర్భం దాల్చేందుకు రెడీ అవుతుంది. 8 నెలలకు ఒకసారి ఒకటి లేదా రెండు పిల్లల చొప్పున, తన జీవిత కాలంలో 20 వరకు పిల్లలను కంటుంది. కోతులు నిలకడగా ఉండకపోవడం, అన్నీ ఒకేలా ఉండటంతో ప్రభుత్వాలు కోతులను లెక్కించడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయాలనుకున్నా సక్సెసవడం లేదు. దేశంలో 2 కోతుల సంరక్షణ కేంద్రాలుండగా, అందులో ఒకటి రాష్ట్రంలోని నిర్మల్‌లో ఉంది. ఇక్కడ కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ఆపరేషన్లు చేసేందుకు ముగ్గురు వైద్యులను నియమించినా అనుకున్నంతగా జరగడం లేదు.
సక్సెస్ కాని మంకీ ఫుడ్‌కోర్టులు
ప్రభుత్వ భూములను గుర్తించి, కనీసం రెండు, మూడు గ్రామాలకో మంకీ ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్గతంలో చెప్పారు. అటవీశాఖ ప్లాంటేషన్‌లో 10 శాతం పండ్ల మొక్కలు ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా జామ, సీతాఫలం, నేరేడు, వెలగ, చింత, ఉసిరి లాంటి మొక్కలు నాటాలని సూచించారు. ఆ చెట్లు పెరిగితే కోతులు ఊళ్లపైకి రావన్నది ముఖ్యమంత్రి ఆలోచన. కానీ చాలా జిల్లాల్లో ఫుడ్ కోర్టుల ఏర్పాటు దిశగా ఆఫీసర్లు చర్యలు తీసుకోలేదు. సర్కారు భూములు అందుబాటులో లేవని ప్రధానంగా చెబుతున్నారు. కొన్నిచోట్ల నామ్‌కే వస్తేగా ఏర్పాటుచేసినా సంరక్షణలేక మొక్కలు ఎండిపోవడమో, ఎదగకపోవడమో జరిగింది. దీంతో కోతులు ఎప్పట్లాగే ఊళ్ల మీదపడుతున్నాయి.
ఈజీ ఫుడ్‌కు అలవాటుపడ్డయ్
అడవుల్లో ఉండాల్సిన కోతులు గ్రామాలు, పట్టణాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నయ్. ఈజీ ఫుడ్‌కు అలవాటు పడుతున్నయ్. వాటి ప్రవర్తనలోనూ, ఇమ్యూనిటీలోనూ మార్పు కనిపిస్తోంది. ఇలాంటి కోతులను ఇక అడవులకు తరలించడం చాలా కష్టం.
– డా.అంజిలప్ప, జిల్లా పశు వైద్యాధికారి, నాగర్ కర్నూలు
కోతుల జీవనశైలిలో మార్పు
అడవులను వీడి ఊళ్లకు వస్తున్న కోతుల జీవనశైలిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు అడవుల్లో పండ్లు, కాయలు, ఆకులు తిని బతికేవి. కానీ ఇప్పుడు మనుషులు తినే తిండే అవి కూడా తింటున్నయి. తినుబండారాలు, స్నాక్స్ కోసం ఎగబడుతున్నాయి. ఊళ్లలోకి వచ్చిన కోతులు మళ్లీ అడవిలోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.
గుంపుగా తిని పోతున్నయ్
కోతులు గుంపులు గుంపులుగా వచ్చి కూరగాయల తోటమీద పడుతున్నయ్. ఒక్క కాయ మిగలట్లే. 4 ఎకరాల్లో మక్క, రెండెకరాల్లో కీరా దోస, రెండెకరాల్లో వరి పెట్టిన. ఏమి మిగలకుండ తిన్నయ్. వరి గొలకనూ వదలట్లే. కోతుల వల్ల ఈ సీజన్ లో లక్ష రూపాయలు లాస్.
= వంగ మధుసూదన్ రెడ్డి , రైతు, మర్రిముస్త్యాల, సిద్దిపేట జిల్లా