హంగూ ఆర్భాటం లేకుండా.. చకచకా జరిగిన ధర్మేంద్ర అంత్యక్రియలు.. అందరూ శ్మశాన వాటికలోనే నివాళులు

హంగూ ఆర్భాటం లేకుండా.. చకచకా జరిగిన ధర్మేంద్ర అంత్యక్రియలు.. అందరూ శ్మశాన వాటికలోనే నివాళులు

లెజండరీ యాక్టర్.. హీ మ్యాన్ ధర్మేంద్ర అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మరణ వార్త జనం అందరికీ తెలిసేలోపే.. అంత్యక్రియలు కూడా చకచకా జరిగిపోయాయి. ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు సినీ ఇండస్ట్రీ దిగ్గజాలు వచ్చే వరకు.. ధర్మేంద్ర మరణ వార్త లోకానికి తెలియకపోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2025, నవంబర్ 24వ తేదీ ఉదయం ఆయన.. ఇంట్లోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ విషయం బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా సాగిపోయాయి. 60 ఏళ్ల సినీ ప్రస్థానం.. 300 సినిమాలు చేసిన ధర్మేంద్రకు ఇంట్లో నివాళులర్పించటానికి ఎవరూ వెళ్లలేదు. నేరుగా శ్మశాన వాటిక దగ్గరకే అందరూ వెళ్లడం ఒకింత విస్మయానికి గురిచేసింది.

ధర్మేంద్రకు ఆయన పెద్ద కుమారుడు సన్నీ డియోల్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్, అనిల్ కపూర్.. ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరై ఈ ఎవర్ గ్రీన్ హీరోకు తుది వీడ్కోలు పలికారు.