హైదరాబాద్: ఐబొమ్మ రవి ఐదు రోజుల కస్టడీ సోమవారంతో ముగిసింది. కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రవి ఒక్కడే పైరసీ చేసినట్టు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లల్లో 100 కోట్ల రూపాయలు వరకు సంపాదించినట్టు తేల్చారు. 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. యాప్ ద్వారానే బేరమాడి సినిమాలను కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్ లోడ్ చేసినట్లు తేలింది. యూఎస్‌డీ ద్వారా సినిమా అమ్మిన వాళ్లకు రవి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు.
సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్ యాక్సెస్ తీసుకుంటున్న రవి.. సినిమాపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ చేశాడు. మ్యాట్రిమొనీ, బెట్టింగ్, గేమింగ్‌తో పాటు పలు యాడ్స్‌కు పైరసీ సినిమాలను లింక్ చేశాడు. ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేశాడు. 50 లక్షల పైచిలుకు వ్యూయర్‌షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున్న.. కోట్లలో సంపాదించాడు. ఇండియాలో ఉన్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కి నిధుల బదలాయింపు జరిపాడు. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కి వచ్చిన నిధులను యూఎస్‌డీటీ ద్వారా మళ్లించుకున్నాడు.
సినిమా పైరసీకి సంబంధించి ఐదు రోజులపాటు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో రవిని సీసీఎస్ పోలీసులు విచారించారు. ఐదు రోజుల విచారణలో రవి బ్యాంకు లావాదేవీలు.. పైరసీకి సంబంధించిన వివరాలపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఐదు రోజుల విచారణ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి రవిని పోలీసులు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో రవిని జడ్జి ముందు హాజరు పర్చి చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవిని తరలించే అవకాశం ఉంది.
ఐబొమ్మ రవి అడ్వకేట్ శ్రీనాథ్ ఏం చెప్పారంటే..
* ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగిసింది
* కస్టడీలో కేవలం పోలీసులకు సహకరించలేదనేది అవాస్తవం
* ఇమంది రవిపై మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి
* ఒక్క కేసులో మాత్రమే రిమాండ్ విధించారు
* మరో 4 కేసులో పిటి వారెంట్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు
* రవి బెయిల్ పిటిషన్ వేశాము.. మంగళవారం బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతాయి.
