నేను రాజీనామా చేయడం లేదు.. కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నేను రాజీనామా చేయడం లేదు.. కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

తాను రాజీనామా చేయడం లేదని కుండబద్దలు కొట్టారు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సోమవారం (నవంబర్ 24) నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా ఎన్నిక గురించి.. నా రాజీనామా గురించి ఆలోచించడం మానేయాలని సూచించారు.

స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాత నా కార్యాచరణ, ప్రణాళిక ఉంటుంది. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్.. నేను దేశంలో ఎక్కడ ఫ్లైట్ దిగినా నా అభిమానులు ఎదురు వస్తారు.
దటీజ్.. కడియం శ్రీహరి.. అని అన్నారు. 

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై  విచారణను నాలుగు వారాల్లోగా ముగించాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. గడువును పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత త్వరగా అఫిడవిట్ దాఖలు చేయాలని కడియంను స్పీకర్ ఆదేశించారు. మొదటి విడతలో  ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపగా.. 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత వారంతా స్పీకర్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు.

 కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రమే మొదటి విడత నోటీసులకు స్పందించలేదు. దీంతో స్పీకర్ ఈ ఇద్దరికీ రెండోసారి నోటీసులు పంపించారు. దీనికి కడియం స్పందించి మరింత గడువు కోరగా.. దానం మాత్రం ఇప్పటి వరకు ఈ నోటీసులపై  స్పందించలేదు. ఆయన అఫిడవిట్ దాఖలు చేయకుండా రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నట్టు దానం శిబిరంలో జోరుగా ప్రచారం సాగుతోంది.