మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ లో అమ్ముకునే వీలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ పర్యటనలో భాగంగా సోమవారం (నవంబర్ 24) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.. హైటెక్ సిటీ శిల్పారామంలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ సైతం ఏర్పాటు చేశామని వివరించారు. ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.
ప్రజాపరిపాలనలో ఆడబిడ్డల పాత్ర ప్రత్యేకం అని చెప్పిన సీఎం.. ఆడబిడ్డల పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని అన్నారు. ఆడబిడ్డల అభ్యున్నతికి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని.. వెయ్యి బస్సులను మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. సోలార్ ప్లాంట్లకు మహిళలను యజమానులను చేస్తున్నామని చెప్పారు.
ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు సీఎం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు.. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నాం మని తెలిపారు.
